KTR | ‘ఆత్మహత్యల తెలంగాణగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే’

అందమైన తెలంగాణను అందలమెక్కిన ఏడాదిలోనే ఆత్మహత్యల తెలంగాణ మార్చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-02-02 10:21 GMT

అందమైన తెలంగాణను అందలమెక్కిన ఏడాదిలోనే ఆత్మహత్యల తెలంగాణ మార్చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనంటూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు అసాధ్యమని అబద్ధాలు చెప్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పదేళ్ల పాలనలో తెలంగాణను బీఆర్ఎస్ దేశానికే అన్నపూర్ణగా మార్చిందని, కానీ ఈ ప్రభుత్వం మాత్రం వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రాన్ని గుల్లగుల్ల చేసిందని ఆరోపించారు. ప్రజలకు సంక్షేమాన్ని అందని ద్రాక్షలా మార్చిందని, ఈ ప్రభుత్వ పాలనలో ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేదని అన్నారు. అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణ మార్చడానికి కాంగ్రెస్‌కు ఏడాది కూడా పట్టలేదంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ధ్వజమెత్తారు.

‘‘ఆకలిచావులు, ఆత్మహత్యల తెలంగాణను పదేళ్ల పాలనతో కేసీఆర్ దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణను చేశారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్ ను కుదేలు చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులు రాక, మిత్తి కూడా ఎల్లక ఉసురు తీసుకుంటున్నారు. పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి కేసీఆర్ గారు రైతులలో ఆత్మవిశ్వాసం నింపి, వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచారు. ఏడాది రేవంత్ పాలనలో సాగునీళ్లు లేక, కరంటు రాక, పంటలు కొనుగోలు చేయక, రైతుభరోసా లేక, రుణమాఫీ గాక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News