వరంగల్ లో బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం వరంగల్‌ లో పర్యటించనున్న నేపథ్యంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

By :  Vanaja
Update: 2024-06-29 11:00 GMT

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం వరంగల్‌ లో పర్యటించనున్న నేపథ్యంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణాన్ని తొలగించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ యోచనలపై బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు పేరును వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌గా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సైతం బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వరంగల్ పర్యటన వేళ నిరసనలు తెలపాలన్న బీఆర్ఎస్ నేతల నిర్ణయానికి అధికారులు బ్రేకులు వేశారు. ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

ముఖ్యమంత్రి పర్యటనకు ముందు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. దీంతో శుక్రవారం రాత్రే కాకతీయ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థి సంఘాల నేతలను పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్న కాంగ్రెస్ నేతల ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించిందని చెబుతున్నారు. మళ్ళీ సర్వేలు నిర్వహించేందుకు చాలా సమయం అవసరమని, వివిధ అభివృద్ధి పనుల అమలులో జాప్యం జరుగుతుందని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. రేవంత్ రెడ్డి రాకవేళ ఆందోళన బాటపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.

సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పాలి...

బీఆర్ఎస్ నేతలను, విద్యార్థి సంఘాల నాయకులను గృహనిర్బంధంలో ఉంచడాన్ని బీఆర్‌ఎస్ నేత రాకేష్ రెడ్డి ఖండించారు. ప్రజాపాలన కల్పిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతోందని, అయితే ప్రజలను అరెస్టు చేసి ఎన్నికైన ప్రజాప్రతినిధుల వద్దకు రాకుండా ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని ప్రశ్నించారు. "రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ తోరణాన్ని తొలగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ యోచనపై స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నాం’’ అని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాకతీయ తోరణం నియంతృత్వానికి చిహ్నమని చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే కాంగ్రెస్ నేతల నివాసాల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాలను సహించబోమని ఆయన అన్నారు.

Tags:    

Similar News