తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. చెప్పినట్టే పంద్రాగస్టున రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసింది.

By :  Vanaja
Update: 2024-08-15 13:57 GMT

తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. చెప్పినట్టే పంద్రాగస్టున రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసింది. నేడు రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు జమ చేసింది. గురువారం ఖమ్మం జిల్లా వైరాలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావు బటన్ నొక్కి రుణమాఫీ నిధులను విడుదల చేశారు.

మూడు విడతల్లో రుణమాఫీ...

32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించింది. జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టింది.

జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేసింది.

జులై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది. ఒక లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణమున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేసింది. 12 రోజుల్లో దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12 వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేసింది.

ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మూడో విడత పంట రుణమాఫీని విడుదల చేసింది. మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాల మాఫీ నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ విధి విధానాల్లో ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించింది.


Tags:    

Similar News