ఏళ్లు గడుస్తున్నా పెండింగులోనే తెలంగాణ రైల్వే ప్రాజెక్టులు

తెలంగాణలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు కాగితాల్లోనే ఉన్నాయి. దీంతో పలు జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ లేదు.;

Update: 2025-07-18 01:35 GMT
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు తెలంగాణ రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరుతున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ఎంపీల బృందం

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో పాటు కొత్త రైల్వే లైన్ల నిర్మాణ ప్రతిపాదనకు(Pending Railway Projects) రైల్వే మంత్రిత్వశాఖ మోక్షం కల్పించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లా కేంద్రాలకు, ప్రముఖ పర్యాటక క్షేత్రాలకు రైల్వే కనెక్టివిటీ ఇప్పటికీ లేదు. ములుగు, నిర్మల్, సూర్యాపేట, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలకు రైలుమార్గమే లేదు. దీంతో పాటు ప్రముఖ దేవాలయాలున్న సమ్మక్క సారక్క, యాదగిరిగుట్ట, వేములవాడ, ధర్మపురి పుణ్యుక్షేత్రాలకు రైలు మార్గం నిర్మించలేదు.


ముగిసిన రీజనల్ రింగ్ రైలు సర్వే
తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి కీలకమైన ప్రాంతీయ రింగ్ రైలు ప్రాజెక్టు సర్వేను రైల్వే అధికారులు ఇటీవల పూర్తి చేశారు. దేశంలోనే మొట్టమొదటిగా రీజనల్ రింగ్ రైలుమార్గాన్ని నిర్మించడం వ్ల ప్రధాన నగరాల్లో ఒత్తిడి తగ్గించడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి ఉపకరించనుంది. 2023వ సంవత్సరంలోనే రింగ్ రైలు ప్రాజెక్టు సర్వేకు రైల్వేశాఖ అనుమతి ఇవ్వడంతో అది ఇటీవల పూర్తి అయింది. వికారాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, రంగారెడ్డి, జనగామ, కామారెడ్డి జిల్లాల మీదుగా రైలుమార్గం ఎలైన్ మెంటు వస్తుందని సర్వేలో తేల్చారు. సికింద్రాబాద్, వరంగల్, గుంటూరు రైలు కారిడార్లతో అనుసంధానించడంతోపాటు గూడ్స్ రైళ్లను మళ్లించడానికి ఈ రింగ్ రైలుమార్గం ఎంతో ఉపకరిస్తుందని రైల్వే అధికారుల సర్వేలోనే వెల్లడైంది.

ఆరు రైలు మార్గాలతో రింగ్ రైలు అనుసంధానం
తెలంగాణలో రీజనల్ రింగ్ రైలు మార్గం ఆరు రైల్వేలైన్లతో అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. సికింద్రాబాద్ -కొత్తపల్లి, సికింద్రాబాద్ -గుంటూరు, సికింద్రాబాద్ -ముత్ ఖేడ్, సికింద్రాబాద్ -డోన్, సికింద్రాబాద్ -వాడి, సికింద్రాబాద్- కాజీపేట రైలుమార్గాలను రింగ్ రైలు మార్గంతో కలపాలని ప్రతిపాదించారు. దీనికోసం మూడు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేశారు. 508 .45 కిలోమీటర్ల రైలుమార్గం నిర్మాణానికి రూ.17,763కోట్లు కావాలని మొదటి ప్రతిపాదన చేశారు. 511.55 కిలోమీటర్ల రింగ్ రైలు నిర్మాణం కోసం 15,964కోట్ల రూపాయలతో రెండో ప్రతిపాదన చేశారు. 392.02 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించేందుకు రూ.12,070 కోట్లు కావాలని మూడో ప్రతిపాదనను రైల్వేశాఖ సర్వేలో రూపొందించింది.

తెలంగాణలో ప్రతిపాదనల్లోనే మగ్గుతున్న కొత్త రైలు మార్గాల నిర్మాణం


రైల్వే పెండింగ్ ప్రతిపాదనలెన్నో...

తెలంగాణ రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఏళ్ల తరబడిగా పెండింగులో ఉన్నాయి. ఈ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించి నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వశాఖను కోరింది.
- తెలంగాణ నుంచి ఔషధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆహార ప్రాసెసింగ్ ఉత్పత్తుల ఎగుమతికి వీలుగా హైదరాబాద్ డ్రై పోర్టును మచిలీపట్నం నౌకాశ్రయానికి అనుసంధానం చేసేలా రైల్వే లైన్ మంజూరు చేయాలని ప్రతిపాదించారు.
- తెలంగాణలో మెరుగైన రైల్వే కార్యకలాపాల కోసం కాజీపేట రైల్వే డివిజన్ ను ( Kazipet Railway Division)ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఏళ్ల తరబడిగా పెండింగులోనే ఉన్నాయి.
- తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, పారిశ్రామిక, వ్యవసాయ ఎగుమతులు, దిగుమతులకు వివిధ ప్రాంతాల కనెక్టివిటీ కోసం కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలనే ప్రతిపాదనలున్నాయి.

కొత్త రైలుమార్గాల ప్రతిపాదనలు పెండింగులోనే...
తెలంగాణ రాస్ట్రంలో నాలుగు కొత్త రైలు మార్గాల నిర్మాణ ప్రతిపాదనలకు (New Railway Line Proposals) ఏళ్ల తరబడిగా మోక్షం లభించడం లేదు. వికారాబాద్-కృష్ణా క 122 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 2,677 కోట్లు అని ప్రతిపాదించినా రైల్వేశాఖ నిధులు విదల్చలేదు.
- కల్వకుర్తి-మాచర్ల 100 కిలోమీటర్ల దూరం కొత్త మార్గం నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 2,000 కోట్లు కావాలని ప్రతిపాదించినా అది కాగితాలకే పరిమితమైంది.
- డోర్నకల్-గద్వాల 296 కిలోమీటర్ల దూరం రైలు మార్గం నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 6,512 కోట్లు కాగా, అది రైల్వే మంత్రిత్వశాఖ వద్ద పెండింగులోనే ఉంది.
- డోర్నకల్-మిర్యాలగూడ 97 కిలోమీటర్ల దూరం కొత్త రైలు మార్గం నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 2,184 కోట్లు కావాలని ప్రతిపాదించినా నిధులు మంజూరు చేయలేదు.

రైల్వే ప్రాజెక్టులకు నిధులివ్వండి : సీఎం
తెలంగాణలో గ్రామీణ పేదరికాన్ని తగ్గించి, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు పది జిల్లాలను కలుపుతూ నిర్మించే రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టుకు రూ. 8వేల కోట్లను మంజూరు చేయాలని తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలోని మంత్రులు, ఎంపీల బృందం రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను (Union Railway Minister AshwiniVaishnaw)రైలుభవన్ లో కలిసి వినతిపత్రాన్ని అందించారు. తెలంగాణలో పెండింగులో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు అయ్యే ఖర్చును రైల్వేశాఖ భరించాలని తెలంగాణ ప్రభుత్వం రైల్వేమంత్రిత్వ శాఖకు విన్నవించింది.


Tags:    

Similar News