సుప్రీంకు చేరిన తెలంగాణ పోన్ ట్యాపింగ్ కేసు..

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ కేసులో అరెస్టయిన పోలీసు అధికారులు బెయిల్ కోసం నానాపాట్లు పడుతున్నారు. తాజాగా ఇది సుప్రీంకోర్టుకు వెళ్లింది.

Update: 2024-10-24 11:30 GMT

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ అంశం వెలుగులోకి వచ్చిన ప్రతిసారీ తీవ్ర రచ్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన పోలీసు(Police) అధికారులు అంతా కూడా ప్రస్తుతం బెయిల్ కోసం నానాపాట్లు పడుతున్నారు. ప్రతిసారీ నిరాశే ఎదురవుతున్నప్పటికీ పట్టువదలని విక్రమార్కుల తరహాలో వారు బెయిల్ కోసం వరుస పిటిషన్‌లు దాఖలు చేస్తూనే ఉన్నారు. వారిలో ఒకరైన తిరుపతన్న తాజాగా సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తొలుత తెలంగాణ హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. కాగా ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. దీంతో తన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ తిరుపతన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై గురువారం.. సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడా ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.

తెలంగాణ సర్కార్‌కు నోటీసులు

తిరుపతన్న పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఛార్జ్‌షీట్ ఫైల్ చేసి మూడు నెలలు అయిన తర్వాత కూడా బెయిల్ ఎందుకు ఇవ్వడం లేదు? ప్రతిసారి బెయిల్ పిటిషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నారు? అని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ ప్రశ్నలకు బదులిస్తూ కౌంటల్ దాఖలు చేయాలని వెల్లడించింది. అనంతరం తిరుపతన్న పిటిషన్ తదుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది.

హైకోర్టు ఏమందంటే..

తనకు బెయిల్ ఇవ్వాలంటూ తిరుపతన్న.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఫోన్ ట్యాపింగ్‌కు ఆయన పాల్పడినట్లు ఆధారాలు ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం వీలుకాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రస్తుతం కేసు విచారణ కీలక దశలో ఉందని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే దాని ప్రభావం దర్యాప్తుపై పడే అవకాశం ఉందని పోలీసులు హైకోర్టుకు వివరించారు. పోలీసుల వ్యాఖ్యలతో ఏకీభవించిన హైకోర్టు.. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌ను రద్దు చేసింది. అనంతరం ఫోరెన్సిక్ ల్యాబరేటరి నివేదిక ప్రకారం దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. ఈ సందర్భంగా తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది. దీంతో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News