చెట్టెక్కి జ్ఞాపకాలు నెమరేసుకున్న కాంగ్రెస్ మంత్రి

పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రజల కంట్లో పడటానికి నానా అగచాట్లు పడుతున్నారు నేతలు. ఈ క్రమంలో ఓ మంత్రి తన వినూత్న ప్రచారంతో అందరినీ సర్ప్రైజ్ చేసేశారు.

By :  Vanaja
Update: 2024-04-20 12:40 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి పెరిగింది. పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రజల కంట్లో పడటానికి నానా అగచాట్లు పడుతున్నారు నేతలు. మెదడుకి పదును పెట్టి, తమ క్రియేటివిటీనంతా జోడించి వినూత్న ప్రచారాలు చేపడుతున్నారు. ఏం చేసినా, ఏం చేసైనా జనాన్ని మెప్పించాలి. టార్గెట్ ఫిక్స్ అంతే.

ఈ నేపథ్యంలో ఏ ప్రాంతానికి వెళితే ఆయా ప్రాంతాల వస్త్రధారణ చేసుకోవడం, నలుగురితో కలిసి స్టెప్పులేయడం, బజ్జీలు వేసేయడం, దోశలు వేసి సర్వ్ చేసేయడం, అక్కడున్న వారితో మాటలు కలిపి ఓట్లేయమని అడగడం చాలా కామన్ గా చూస్తుంటాం. పాదయాత్రలు, బస్సు యాత్రలతో, సైకిల్, బైక్ ర్యాలీ ప్రచారాలూ మనకి తెలుసు. నేతలు సామాన్యుల మధ్యకి వెళ్ళినప్పుడు సాదా సీదా కుర్చీలపై కూర్చుని మాట్లాడటం, రచ్చబండలపైన కబుర్లు చెప్పినట్టు ప్రచారం చేయడం ఇవన్నీ కూడా చూశాం. ఇటీవల నారా లోకేష్ ఓ స్టూల్ పై నిలబడి స్పీచ్ ఇవ్వడం కూడా బాగా వైరల్ అయ్యింది. ఇవన్నీ సింప్లిసిటీలా కనిపించినా, ఆశ్చర్యాన్ని కలిగించవు.


కానీ, తెలంగాణ మంత్రి తన వినూత్న ప్రచారంతో అందరినీ సర్ప్రైజ్ చేసేశారు. చెట్టు మీద కూర్చుని అవ్వలతో ఎన్నికల ముచ్చట్లు చెప్పారు. శనివారం మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత నియోజకవర్గం కొల్లాపూర్ లో పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొల్లాపూర్ మండలం బోడబండ తాండ గ్రామంలో చెట్టుపై కూర్చుని, గిరిజ‌న మ‌హిళ‌లు, వృద్దుల‌తో స‌ర‌ద‌గా మాట్లాడుతూ.. త‌న చిన్న నాటి జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకున్నారు.

ఆ చెట్టు తక్కువ హైట్ లోనే కొమ్మలుగా విడిపోయి, మొదలు బలంగా ఉండటంతో మంత్రి ఇబ్బంది పడకుండా చెట్టెక్కేసినట్టు అర్ధమవుతుంది. ఆ చెట్టుని చూడగానే చిన్నప్పుడు ఆడిన కోతి కొమ్మచ్చి ఆట గుర్తొచ్చింది కాబోలు. ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ చెట్టుపై కూర్చుని సరదా సరదాగా ప్రచారం చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


అన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ -మంత్రి జూపల్లి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల్లానే.. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పాంచ్ న్యాయ్ హామీలను అమలు చేస్తుందని జూపల్లి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుందని, హామీ ఇస్తే అమలుచేసి తీరుతుంద‌ని స్పష్టం చేశారు. హామీల‌ను నిలబెట్టుకోవడంలో రాష్ట్రంలో గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం, కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని విమర్శించారు. లోక్ సభ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆద‌రించాల‌ని కార్యక్రమానికి హాజరైన ఓటర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు అభ్య‌ర్థించారు.


Tags:    

Similar News