ఫలించని చర్చలు... కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల నిరసన

తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఇచ్చిన నిరవధిక సమ్మె పిలుపుతో సోమవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ వైద్యసేవలు దెబ్బతిన్నాయి.

By :  Vanaja
Update: 2024-06-24 13:03 GMT

తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఇచ్చిన నిరవధిక సమ్మె పిలుపుతో సోమవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ వైద్యసేవలు దెబ్బతిన్నాయి. సిబ్బంది కొరత సంక్షోభాన్ని అధిగమించడానికి, ఉపాధ్యాయ సిబ్బందితో సహా సీనియర్ కేర్ ఇచ్చే వారందరినీ సెలవులను రద్దు చేసి, రెగ్యులర్ డ్యూటీకి రిపోర్టు చేయాలని ఆసుపత్రి యాజమాన్యాలు ఆదేశించాయి.

గాంధీ ఆసుపత్రిలో, అధికారులు సోమవారం ఔట్ పేషెంట్ వింగ్ పనిచేసేలా చూసుకున్నారు. అయితే మెడికో సమ్మె కారణంగా 50కి పైగా ఎలక్టివ్ సర్జరీలను వాయిదా వేయవలసి వచ్చింది. తమ స్టైఫండ్‌లను సక్రమంగా చెల్లించేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, మెరుగైన హాస్టల్ సౌకర్యాలు, ఆసుపత్రి ఆవరణలో భద్రత, అనేక ఇతర సమస్యలతో జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వాలు మారినా తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్స్ నెరవేర్చాలని ఆందోళన బాటపట్టారు.

ఫలించని చర్చలు...

సోమవారం తెల్లవారుజాము నుంచి రెగ్యులర్‌ మెడికల్‌ విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్న జూనియర్‌ వైద్యులతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ భేటీ అయ్యారు. మధ్యాహ్నం వారితో చర్చలు జారిపరు. కానీ చర్చలు సానుకూల ఫలితాలు ఇవ్వలేదు. తమ డిమాండ్లలో ఎక్కువ భాగం పరిష్కరించకపోవడంతో.. ఔట్ పేషెంట్ డ్యూటీలు, ఎలెక్టివ్ సర్జరీలు, ఇన్‌పేషెంట్ వార్డు విధులు సహా వైద్య సేవల నుంచి నిరవధిక బహిష్కరణ కొనసాగించాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టిజెయుడిఎ) సభ్యులు నిర్ణయించారు.

జూనియర్ డాక్టర్ల డిమాండ్స్...

గత ఆరు నెలలుగా తమకు స్టైఫండ్ సరైన సమయానికి రావడం లేదన్నారు. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మించాలని ఆరేళ్లుగా కోరుతున్నా... ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. ఉస్మానియా హాస్పిటల్ లో స్థలం లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని... డాక్టర్లకు కూడా ఎలాంటి సౌకర్యాలు ఉండటం లేదని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులకు సీట్లు పెంచుతున్నారు కానీ హాస్టల్స్ పెంచడం లేదని... ఇరుకు గదులలో తాము ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని... తరచూ వైద్యులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా నూతన భవనం తో పాటు, తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ సమ్మెను ఉదృతం చేస్తామని జూడాలు హెచ్చరించారు.

Tags:    

Similar News