మెడికల్ సీట్ల స్థానికత వివాదంపై హైకోర్టు కీలక తీర్పు

మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 33 తో స్థానికతపై వివాదం చెలరేగింది.

By :  Vanaja
Update: 2024-09-05 15:47 GMT

మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 33 తో స్థానికతపై వివాదం చెలరేగింది. ఈ అంశంపై గురువారం విచారణ జరిపిన తెలంగాణ హై కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. స్థానికులంతా స్థానిక కోటా కింద అర్హులేనని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. స్థానికులు ఎవరనే అంశంపై సరైన మార్గం నిర్దేశకాలు లేవని ధర్మాసనం పేర్కొంది. స్థానికత నిర్ధారణకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది. కాళోజీ నారాయణరావు వైద్య యూనివర్సిటీ.. విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

మెడికల్ అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ రూల్ '3ఏ'ను చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో 33 ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్ట్ అలోక్ ఆరాధే, జస్టిస్ జే. శ్రీనివాస రావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు బి.మయూర్ రెడ్డి, డి.వి. సీతారామమూర్తి తదితరులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల సవరణ వల్ల స్థానికులకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని కోర్టుకు తెలియజేశారు. ఇతర రాష్ట్రాల వారితో పాటు భారతీయ మూలాలు ఉన్న ఎన్నారైలు ఇక్కడ నాలుగేళ్లు చదువుకుంటే 85% స్థానిక కోటా కింద అవకాశం దక్కించుకుంటున్నారన్నారు. దీనివల్ల తెలంగాణలో పుట్టి పెరిగిన వారికి నష్టం జరుగుతుందన్నారు.

స్థానిక కోటా ఇక్కడ నివాసం ఉన్న వాళ్లకే అడుగుతున్నామని చదువుకున్న వారు అన్నదానిపై అడగడం లేదన్నారు. ఉద్యోగులు బదిలీ కావడం వంటి పరిస్థితుల్లోనూ, అలాగే మెరుగైన విద్య కోసం ఇంటర్ మరో రాష్ట్రంలో చదువుకున్న తెలంగాణ విద్యార్థులు స్థానికులు కారని చెప్పడం సరికాదన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల పిల్లలకు అవకాశం ఇస్తామన్న ప్రభుత్వం... ప్రైవేటు ఉద్యోగుల పిల్లలకు అవకాశం నిరాకరించడం వివక్ష చూపడమేనన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ జీవో తీసుకొచ్చినట్లు వెల్లడించారు. నిబంధనలు తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వెల్లడించింది.

కొత్త నిబంధనలతో స్థానికత వివాదం...

ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనల వలన స్థానికులకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆగస్టు నెల 3న కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఇక్కడ విద్యాసంస్థల అడ్మిషన్లలో 2014 నుంచి 2024 వరకు ఏపీ విద్యార్థులకు కోటా ఉన్నది. ఈ ఏడాదితో విభజన చట్టంలోని గడువు ముగియడంతో కాళోజి యూనివర్సిటీ తాజా అడ్మిషన్ల ప్రక్రియ కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో స్థానికతపై గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం జులై 19న జారీ చేసిన 33 జీవో ప్రకారం స్థానికత నిబంధనలు మార్చినట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది.

33 జీవోతో మాకు అన్యాయం జరిగేలా ఉందని తెలంగాణ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణిస్తామని నోటిఫికేషన్లో పేర్కొనడంతో వివాదం చెలరేగింది. 2023-24 విద్యా సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏడేళ్ల కాలంలో గరిష్ఠంగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణలోకి తీసుకునేవారు. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి స్థానికతలో చేసిన మార్పులతో తెలంగాణ వారికే ఎక్కువ అన్యాయం జరగనుందనే ఆరోపణలు వస్తున్నాయి. 33 జీవో ప్రకారం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఏపీ విద్యార్థులకు లాభం చేకూరుతుందని ప్రధానంగా వినిపిస్తోన్న ఆరోపణ. ఈ నిబంధనతో హైదరాబాద్ లో చదివిన ఏపీ విద్యార్థులు తెలంగాణాలో స్థానికులుగా ఉంటారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాలకి చెందిన విద్యార్థులు గుంటూరు, విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతుంటారు. ఇలా ఇంటర్ చదవడానికి పొరుగు రాష్ట్రాలకి వెళ్లినవారికి కొత్త నిబంధనతో స్థానికత కోటను కోల్పోతారు అని వాదిస్తున్నారు.

Tags:    

Similar News