మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్..

సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. జర్నలిస్ట్‌పై దాడి కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

Update: 2024-12-23 10:41 GMT

సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. జర్నలిస్ట్‌పై దాడి కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు నిర్ణయంతో మోహన్ బాబు అరెస్ట్ కావడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు అరెస్ట్‌కు అంతా రెడీ అయిందని, రేపో మాపో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుంటారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్‌పై జరుగుతున్న వాదనల్లో మోహన్ బాబు ఆరోగ్యం సరిగా లేదని, ఆయన గుండె, నరాల సంబంధిత సమస్యలు, మతిమరుపుతో బాధపడుతున్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలో ఉన్నారని, ఇటీవల మనవడిని కలవడం కోసం దుబాయ్ వెళ్లిన మోహన్ బాబు తిరిగి తిరుపతికి చేరుకుని విద్యాసంస్థల బాధ్యతలు చేపట్టారని న్యాయవాది చెప్పారు. ఈ క్రమంలోనే విలేకరిపై దాడి ఘటనలో మోహన్ బాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తూన్నట్లు ప్రకటించింది.

న్యాయవాదుల వాదనలు ఇలా..

డిసెంబర్ 10న విలేకరిపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. ఈ అంశంపై పోలీసులు అటెంప్ట్‌ టు మర్డర్ కేసు నమోదు చేశారని, విలేకరికి, మోహన్‌బాబుకు అసలు పరిచయమే లేదని, అలాంటి సమయంలో హత్యాయత్నం ఎలా చేస్తారని, పోలీసులు పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు సరైనవి కావని వాదించారు. మోహన్ బాబు కుటుంబ సమస్యలను మీడియా సంస్థలు పెద్దవి చేసి చూపించాయని, మంచు మనోజ్‌తో వచ్చిన బౌన్సర్లతో ప్రాణహాని ఉండటంతోనే ఆ సమయంలో మోహన్ బాబు అలా రియాక్ట్ అయ్యారని ఆయన తరపు న్యాయవాది వివరించారు. అనంతరం తన వాదనలను వినిపించడం ప్రారంభించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్.. ఈ ఘటనపై తొలుత పహడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారని ఆతర్వాత బాధితుడి వాంగ్మూలం ప్రకారం సెక్షన్లు జోడించడం జరిగిందని చెప్పారు. ఈ కేసులో మోహన్ బాబు విచారణకు హాజరుకావాల్సిందేనని, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. ఇరు వర్గా వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్.. ఈ పిటిషన్‌ను కొట్టివేశారు.

కాగా విచారణకు హాజరైన రోజే ట్రయల్ కోర్టులో బెయిల్ మంజూరు చేయాలని కింది కోర్టు ఆదేశించాలని మోహన్ బాబు తరపు న్యాయవాది కోరారు. ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కోర్టు తీర్పుతో ఈ కేసు విషయంలో తదుపరి చర్చలు తీసుకోవడానికి పహడీషరీఫ్ పోలీసులు సిద్దమయ్యారు.

Tags:    

Similar News