తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ.. 'సుప్రీం'కి కేసీఆర్?

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

By :  Vanaja
Update: 2024-07-01 08:09 GMT

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని రద్దు చేయాలంటూ కేసీఆర్ నాంపల్లి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై నేడు (సోమవారం) న్యాయస్థానంలో విచారణ జరిగింది. విచారణ అనంతరం కేసీఆర్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కమిషన్ ఏర్పాటును సమర్ధిస్తూ... విచారణ ఎదుర్కోవాల్సిందే అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పుతో విచారణకి హాజరవ్వాలంటూ కమిషన్ నోటీసులు ఇచ్చిన మేరకు కేసీఆర్ విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఆయన మొదటి నుంచి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని తప్పుబడుతూ ఉన్నారు. దీంతో ఆయన విచారణకి హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ కేసులో తీర్పు ప్రతికూలంగా వస్తే... ఆ తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టు మెట్లు తొక్కే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపించింది. వీటిపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నరసింహారెడ్డితో కూడిన కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ వెంటనే విచారణ ప్రారంభించింది. అందులో భాగంగా కమిషన్ కేసీఆర్ కి నోటీసులు పంపింది. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతోపాటు ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది.

కమిషన్ ఇచ్చిన నోటీసులపై స్పందించిన కేసీఆర్.. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. తమ హయాంలో విద్యుత్ విషయంలో గణనీయ మార్పు చూపించామన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ని అందించామన్నారు. ఆ తరువాత కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఆయన వేసిన పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు జూన్ 28న విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా... ప్రభుత్వం, కేసీఆర్ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వీరి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది.

Tags:    

Similar News