‘రైతుల్లో అసంతృప్తి లేదు’.. రుణమాఫీపై మంత్రి ప్రకటన

తెలంగాణ రైతుల రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రుణమాఫీ ఇంకా జరుగుతుందని చెప్పారు.

Update: 2024-10-07 10:18 GMT

తెలంగాణ రైతుల రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రుణమాఫీ ఇంకా జరుగుతుందని చెప్పారు. ఇంకా రుణమాఫీ కాని, రూ.2లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతుల విషయంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. గాంధీభవన్ వేదికగా ఈరోజు జరిగిన మంత్రుల ముఖాముఖీలో ఆయన రుణమాఫీ అంశంపై స్పందించారు. కొన్ని రోజులుగా తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రతిపక్షాలు రుణమాఫీని ఒక అస్త్రంలా వినియోగించుకుంటున్నాయని, తమ ప్రభుత్వం ప్రతి రైతుకు న్యాయం చేస్తుందని భరోసా కల్పించారు. దసరా పండుగ తర్వాత రాష్ట్రంలో రూ.2 లక్షల కన్నా అధిక రుణం ఉన్న రైతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుందని, ఇప్పటి ఈ మేరకు నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తమ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. అవి ఏమాత్రం సరికాదంటూ ప్రధానిమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన పదినెలల కాలంలో ఎన్ని అప్పులు ఉన్నా రూ.25 వేల కోట్ల రుణాలను రైతులకు మాఫీ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో మాటలకే పరిమితం అయిన రైతు బంధును కూడా అందించామని వివరించారు. ప్రతి రైతుకు న్యాయం చేయడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని తెలిపారు.

రుణమాఫీ విషయంలో వాళ్లకే ఆందోళన

రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతుల్లో ఎటువంటి ఆందోళన లేదని, వారికి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అధికారంలోకి రావాలని కోరుకునే వారు, అధికారం కోల్పోయిన వారే ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారంటూ బీజేపీ, బీఆర్ఎస్‌లపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘రాష్ట్రంలో రూ.2లక్షలకు పైబడి రుణాలు ఉన్న రైతులపై సమీక్ష నిర్వహిస్తాం. అతి త్వరలోనే వారి విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటాం. రైతులకు తాము అండగా ఉంటామని, ఉన్నామని బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పుడు ముందు వస్తున్నాయి. వారు చేసిన రైతు వ్యతిరేక చర్యలు మార్చిపోయారా? బీఆర్ఎస్ నేతలు చెప్పేవన్నీ మాయమాటలే.. రుణమాఫీ అని రైతులను నిలువునా ముంచిన బీఆర్ఎస్ ఇప్పుడు తాము రైతు నేతలమని, తమ అధినేత కేసీఆర్‌ది రైతు గుండె అని అంటుంటే విడ్డూరంగా ఉంది’’ అని చురకలంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వాళ్లు చేస్తున్న ప్రచారంలో కూడా ఎటువంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.

మాకేది నిరసన సెగ

ప్రభుత్వ విధానాలపై రైతుల్లో వ్యతిరేకత, అసంతృప్తి, నిరసన చేసే ఆలోచన ఏమాత్రం లేదని మంత్రి తుమ్మల తేల్చి చెప్పారు. నిజంగా ప్రతిపక్షాలు చెప్తున్న స్థాయిలో రైతుల్లో ఆగ్రహం, అసంతృప్తి ఉంటే ఇప్పటికే మాకు వారి నిరసన సెగ తగిలి ఉండేదని, కానీ ఇప్పటి వరకు తమ ప్రభుత్వం కానీ, నేతలు కానీ అటువంటి పరిస్థితులు ఎక్కడా ఎదుర్కోలేదని గుర్తు చేశారు. ‘‘మేము రైతులతో ప్రతిరోజూ తిరుగుతున్నాం. ప్రభుత్వంపై అసంతృప్తి, కోపం, అపనమ్మకం ఏమాత్రం వారిలో మాకు కనిపించలేదు. ఒకవేళ వాటిలో ఏది ఉన్నా మాకు నిరసన సెగ తప్పకుండా తగిలి ఉండేది. కానీ అలా ఏమీ జరగలేదు’’ అని తుమ్మలు తేల్చి చెప్పారు.

Tags:    

Similar News