గొర్రెలు మేపుతున్న సిరిసిల్ల ఐఐటీ ర్యాంకర్..

రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన గిరిజన బాలిక ఐఐటీ లో మంచి ర్యాంకు సాధించింది.

By :  Vanaja
Update: 2024-07-24 15:00 GMT

రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన గిరిజన బాలిక ఐఐటీ లో మంచి ర్యాంకు సాధించింది. కానీ పై చదువులకి కుటుంబ ఆర్ధిక స్థోమత అడ్డొచ్చింది. దీంతో ఊళ్ళోనే ఉంటూ గొర్రెలు, మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తోంది. బాలిక విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో తన చదువుకి ఆర్ధిక సహాయం చేయాలని నిర్ణయించారు. మరోవైపు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా బాలికకి సహాయం అందించడానికి ముందుకొచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం గోనె నాయక్ తండాకి చెందిన బదావత్ మధులత ఎస్టీ కేటగిరీలో జేఈఈ మెయిన్స్ పరీక్షలో 824వ ర్యాంక్ సాధించింది. ఐఐటీ పాట్నాలో సీటు సాధించింది. అయితే సీటు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆమె రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో అంత పెద్ద మొత్తం చెల్లించలేక ఐఐటీలో చదవాలనే కోరికను విరమించుకుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఇద్దరు సోదరీమణులు తమ తండాలోని కొద్దిపాటి భూమిలో సాగు చేస్తుండగా... మధులత కూడా గ్రామంలో మేకలు, గొర్రెలను మేపడం ప్రారంభించింది.

గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఆర్థిక సహాయం..

బాలిక పరిస్థితిపై మీడియాలో వచ్చిన కథనాలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి చేరగా, మధులతను హైదరాబాద్‌కు పిలిపించారు. మధులత చదువు పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ విషయాన్ని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ అధికారికంగా ధృవీకరించింది. హాస్టల్ ఫీజులు, ఇతర ఫీజులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న ఆ విద్యార్ధి చదువుకు కావల్సిన ఫీజును ప్రభుత్వం సమకూరుస్తుందని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ తెలియజేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాల అధ్యాపకులు బుక్య లింగం నాయక్ ని అభినందించింది.

కాగా, రాములు, సరోజ దంపతులకు మధులత మూడో సంతానం. తమ కుమార్తెను ఆదుకునేందుకు చొరవ చూపిన ముఖ్యమంత్రికి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక బాలిక పరిస్థితిపై స్పందించిన కేటీఆర్ సైతం ఆర్ధిక సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. తన ఎడ్యుకేషన్ కి అయ్యే అవసరాలను చూసుకుంటానని ప్రకటించారు.

Tags:    

Similar News