KTR | తెలంగాణ రైతులు ఆత్మన్యూనతకు గురవుతున్నారా?
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. గతంలో గల్ల పట్టుకుని ప్రభుత్వాన్ని నిలదీసిన రైతులు ఇప్పుడు గల్లాకు ఉరితాడు బిగించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు విడతులగా రూ.20వేల కోట్ల రైతు భరోసాను ఎగ్గొట్టిందని, రూ.15వేల రైతు భరోసా కోసం రైతులు, కౌలు రౌతులు ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. అదే విధంగా రూ.12వేల రైతు భరోసా కోసం రైతు కూలీలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని, కానీ కాంగ్రెస్‌కు ఇవేమీ కానరావట్లేదంటూ మండిపడ్డారు. రెండు పటలకు మాత్రమే రైతు భరోసా ఇస్తారా? మూడో పంట వేస్తే ఇవ్వరా? అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు ఇంకా తొలి పంటకే ఆర్థిక సహాయం అందించలేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఆస్కారం లేకుండా రైతన్నలను భయబ్రాంతులకు ఈ ప్రభుత్వం గురి చేసిందంటూ ధ్వజమెత్తారు కేటీఆర్.
‘‘యాసంగి పోయి -వానాకాలం వచ్చింది. వానాకాలం పోయి-మళ్లీ యాసంగి వచ్చింది. నాడు గల్లా ఎగరేసిన రైతు-నేడు నేలచూపులు చూస్తున్నాడు. నాడు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసిన రైతన్న నేడు ఆత్మన్యూనతతో తండ్లాడుతున్నడు. రుణం తీరక,కొత్త రుణం లేక, అప్పు పుట్టక రైతన్న ఆగమైతుండు. రైతుభరోసా మీద వేసిన మంత్రివర్గ ఉపసంఘంలో మాత్రం చలనం లేదు. రెండు విడతలుగా రూ.20 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టి రూ.31 వేల కోట్ల రుణమాఫీ అని ప్రకటించి .. రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుక చావండి అంటున్నారు. రూ.15 వేల రైతుభరోసా కోసం రైతులు, కౌలురైతులు ఎదురుచూస్తున్నారు. రూ.12 వేల రైతుభరోసా కోసం రైతుకూలీలు ఎదురుచూస్తున్నారు. రెండు పంటలకేనా రైతుబంధు ? మూడో పంటకు ఇవ్వరా అని అధికారం కోసం బీరాలు పలికిండ్రు. మొదటిపంటకే పెట్టుబడి సాయం దక్కక రైతులు ఎప్పుడిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్ని ఎకరాలకు ఇస్తారో? ఎప్పటినుండి ఇస్తారో? అసలు ఇస్తారో? ఇవ్వరో? ఇప్పటివరకూ స్పష్టత లేదు. రైతుభరోసా సాయం సున్నా. రుణమాఫీ అరసున్నా. రైతుబీమా గుండుసున్నా. కాంగ్రెస్ కరకుగుండెలు. కరిగేది ఎన్నడు ? రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేది ఎన్నడు ?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.