KTR | ‘దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలిచింది’
అభివృద్ధిలో దేశానికే స్ఫూర్తిగా తెలంగాణను నిలపడం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.;
కేటీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. అభివృద్ధిలో దేశానికే స్ఫూర్తిగా తెలంగాణను నిలపడం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైందని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ని ఆవిష్కరించారు కేటీఆర్. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘‘గత 10 ఏండ్లలో కేసీఆర్ నాయకత్వంలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి జోడెద్దుళ్ల మాదిరిగా ముందుకు పోయింది. పరిశ్రమలు, పర్యావరణం, ఐటీ, వ్యవసాయం రంగంలో దేశానికి దిక్సూచిగా నిలిచాం. విద్యా రంగంలో కేసీఆర్ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. వెయ్యికి పైగా గురుకులాలను స్థాపించారు.. కేసీఆర్ నాయకత్వంలో బహుశా దేశంలో స్వాతంత్ర్యం అనంతరం ఏ రాష్ట్రంలో జరగలేదంటే అది అతిశయోక్తి కానే కాదు అని కేటీఆర్ తెలిపారు.
గురుకుల విద్యాసంస్థలు తీసుకుంటే.. దేశంలో వెయ్యి పైచిలుకు పాఠశాలలు ఏర్పాటు చేశాం. అణగారిన వర్గాలు దళితులు, గిరజనులు, బలహీన వర్గాల పిల్లలకు సకల సౌకర్యాలు కల్పించి ప్రపంచంతో పోటీపడే విధంగా ఏర్పాటు చేశాం. ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. 60 డిగ్రీ గురుకుల కాలేజీలు, 146 ఉన్న ఇంటర్ రెసిడెన్షియల్ స్కూళ్లను 592కు తీసుకుపోయాం. మొత్తంగా 294 గురుకులాల నుంచి 1022 చేసుకున్నాం. మెడికల్ కాలేజీలు కేవలం 5 ఉంటే.. కేసీఆర్ నాయకత్వంలో జిల్లాకు ఒకటి చొప్పున 33 ఏర్పాటు చేసుకున్నాం. మెడికల్ కాలేజీలే కాకుండా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన ఆలోచనలు చేశారు. అటవీ, హార్టికల్చర్, వెటర్నరీ, మహిళా యూనివర్సిటీలు స్థాపించాం. ఆ యూనివర్సిటీలకు తెలంగాణ ప్రముఖుల పేర్లు పెట్టి గౌరవించుకున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యా దాకా ఎంతో అభివృద్ధి చేశాం. 26 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిని మూడు దశల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి అనే కార్యక్రమాలకు రూ. 7400 కోట్లతో శ్రీకారం చుట్టాం. ఒక దశ పూర్తి చేశాం ఇంతలోనే ప్రభుత్వం మారింది అని కేటీఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెసోళ్లు గోబెల్స్ వారసులు. ఒకటి కాదు రెండు కాదు.. 420 హామీలు ఇచ్చారు. ఎస్సీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. విద్యార్థి డిక్లరేషన్ కూడా ఇచ్చారు. ఢిల్లీ నుంచి టూరిస్టులను తీసుకొచ్చి డిక్లరేషన్ల పేరిట ఊదరగొట్టారు. ఇవి నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్లను పట్టుకుని ఆఫిడవిట్లు తయారు చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఒట్లు పెట్టి డ్రామాలు ఆడారు. గ్యారెంటీ కార్డులు పంచారు. జోసెఫ్ గోబెల్స్ వారసుల మాదిరిగా విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేశారని కేటీఆర్ మండిపడ్డారు.