నీట్, నెట్ స్కామ్... కాంగ్రెస్ వినూత్న నిరసన

నీట్, నెట్ పరీక్షలలో జరిగిన అక్రమాలకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

By :  Vanaja
Update: 2024-06-21 13:01 GMT

నీట్, నెట్ పరీక్షలలో జరిగిన అక్రమాలకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు గాంధీ భవన్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు, యూత్ కాంగ్రెస్, NSUI కార్యకర్తలు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇల్లు ముట్టడి..

నీట్ అవకతవకలపై నిరసనలో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోతె రోహిత్ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. "చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు- అని గాంధీ చెప్పినదానికి పూర్తి విరుద్దంగా నరేంద్ర మోడీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడడం లేదు, హోం మంత్రి అమిత్ షా కి ఏం కనబడడం లేదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యార్థుల ఆర్తనాదాలు వినబడడం లేదు. అందుకే మూడు కోతుల బదులు మోదీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ మాస్కులతో ఆందోళనలు చేపట్టాము" అని కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించాయి.

కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నిరసన కార్యక్రమం చేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నం చేసినట్టు తెలిపారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ, వెంటనే నీట్ పరీక్షను రద్దు చేసి మరల నిర్వహించాలని యువజన కాంగ్రెస్ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇంటి ముట్టడి నేపథ్యంలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోత రోహిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News