Telangana CM | ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ లేఖ, ఏం రాశారంటే...

ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి లేఖ రాశారు. ఆ లేఖలో చంద్రబాబుకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Update: 2024-12-30 16:28 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించిన నేపథ్యంలో తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఏపీ సీఎంకు లేఖ రాశారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి రాసిన లేఖలో కృతజ్ఞతలు తెలిపారు.

- తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధులైన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యుత్తరం రాశారు.

తిరుమలతో తెలంగాణకు అనుబంధం
తెలంగాణ ప్రజలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో గుర్తుచేశారు.గత సంప్రదాయం ప్రకారం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చే విజ్ఞాపనల మేరకు స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలో కోరారు.

తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు
తిరుమల శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎంకు రాసిన లేఖలో తెలిపారు.

ప్రతీ ప్రజాప్రతినిధికి వారానికి రెండు లేఖలకు అనుమతి
ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్)కోసం రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ (రూ. 300/- టికెట్) కోసం రెండు లేఖలు స్వీకరించనున్నట్లు ఏపీ సీఎం పేర్కొన్నారు. ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయొచ్చని చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు భాషలోనే లేఖలు రాసుకోవడం విశేషం.


Tags:    

Similar News