కిటాక్యూషూ నగరంలో తెలంగాణ సీఎం రేవంత్ కు సంప్రదాయ స్వాగతం
జపాన్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కిటాక్యూషూ నగరాన్ని సందర్శించారు.కలుషిత నగరంలో కాలుష్య నివారణకు తీసుకున్న చర్యల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.;
By : Shaik Saleem
Update: 2025-04-20 13:01 GMT
జపాన్ దేశంలోని ప్రఖ్యాత కిటాక్యూషూ నగరంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ బృందానికి స్థానిక జపనీస్ సాంప్రదాయ రీతిలో సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులకు కిటాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ ఆత్మీయ స్వాగతం పలికారు.
కాలుష్య నివారణకు చర్యల గురించి సీఎంకు వివరించిన మేయర్
ఒకప్పుడు జపాన్ దేశంలో అత్యంత కాలుష్యపూరిత నగరంగా పేరుగాంచిన కిటాక్యూషూలో గాలి, నీరు, నేల అన్నీ తీవ్ర కాలుష్యంతో కూరుకుపోయిన దుస్థితి ఉండేది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన పర్యావరణ పరిరక్షణ విధానాలతో కిటాక్యూషూ నగరం కోలుకుంది. పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ ఆవిష్కరణలు, సుస్థిరత పరంగా కిటాక్యూషూ నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
పర్యావరణ పునరుజ్జీవనానికి, సుస్థిర నగర అభివృద్ధికి ఒక ఆదర్శ నమూనాగా మారింది.కాలుష్యం నుంచి బయటపడేందుకు కిటాక్యూషూ నగరంలో అమలు చేసిన విధానాలను, ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలను మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వంలోని అధికారుల బృందం ముఖ్యమంత్రికి వివరించింది.