జీవో317 రద్దుపై నివేదికిచ్చిన సబ్ కమిటీ.. అందులో ఏముందంటే..

జీవో నెంబర్ 317 అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు తన నివేదికను అందించింది.

Update: 2024-10-20 14:00 GMT

జీవో నెంబర్ 317 అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు తన నివేదికను అందించింది. సీల్డ్ కవర్లో తమ నివేదికను సీఎంకు ఇచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల అభిప్రాయాలను వినతుల రూపంలో ప్రత్యక్షంగా, వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించింది. అదే విధంగా ఈ సమస్య పరిష్కారం కోసం వివిధ శాఖలు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరీ ఈ నివేదికను సిద్ధం చేసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ తెలిపింది.

దీనిపై అతి త్వరలో కేబిననెట్ సమావేశం జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జీవో 317 బాధితులతో గాంధీభవన్‌లో చర్చించారు. ఇప్పటికే జీవో 317పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని, ఉప సంఘంతో ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు.

అయితే తాము అధికారంలోకి వస్తే 48 గంటల్లో జీవో 317 సమస్యను పరిష్కరిస్తామన్న కాంగ్రెస్ సర్కార్.. పది నెలలు గడుస్తున్నా ఏం చేస్తోందని జీవో బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఈ జీవో బాధితులంతా గాంధీభవన్‌ను బుట్టడించే ప్రయత్నం చేశారు. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం జరిగే వరకు నిరసన చేస్తామని హెచ్చరించారు.

పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే..

ఈరోజు జీవో 317 బాధితులతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ప్రజలను ఇబ్బంది పెట్టే జీవో తీసుకొచ్చయిన వాళ్లే ఇప్పుడు ఈ ప్రభుత్వంపై ఆ జీవోను ఎందుకు ఇంకా ఎందుకు తొలగించలేదని విమర్శించడం విడ్డూరంగా ఉందంటూ బీఆర్ఎస్‌పై సెటైర్లు వేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడిగా చెప్తున్నానని అన్నారు.

‘‘బాధితులకు అన్యాయం జరగనివ్వం. పలు సమస్యల వల్ల సమస్య పరిష్కారం వాయిదా పడింది. కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేసింది. గాంధీ జయంతి రోజు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. జీవో 317 సమస్య పరిష్కారం కోసం కట్టుబడి ఉన్నాం. బాధితులకు న్యాయం చేయాలనే చూస్తున్నాం. అందుకు కట్టుబడి ఉన్నాం’’ అని వివరించారు పొన్నం ప్రభాకర్.

అసలు జీవో 317 ఏంటి

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో అప్పటి వరకు 10గా ఉన్న జిల్లాలను పునఃవ్యవస్థీకరించారు. 10 జిల్లాలను కాస్తా 33 జిల్లాలుగా విభజించింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. తొలుగు 2016 అక్టోబర్లో 31 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సర్కార్.. 2019 ఫిబ్రవరిలో ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది. అప్పుడు కొన్ని జిల్లాల్లో 9 మండలాలు, మరికొన్నింటిలో 30 మండలాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ముగిసిన వెంటనే ఉద్యోగులందరినీ కూడా వర్క్ టు ఆర్డర్ కింద కొత్త జిల్లాలకు కేటాయించారు. కానీ అవి శాశ్వత కేటాయింపులు కాదు. అన్నీ తాత్కాలికమైనవే.

2018లో ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపు అంశంలో ప్రభుథ్వం కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. మొత్తం 31 జిల్లాలను 7 జోన్లు, 2 మల్టీ జోన్లును పునఃవ్యవస్థీకరణ చేసింది. దీనికి కేంద్రం నుంచి 2011లో ఆమోద ముద్ర పడింది. ఈలోగా.. జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లుగా మూడంచెల కేడర్లకు రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పోస్టులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం 6 డిసెంబర్ 2021న ప్రభుత్వం జీవో 317ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలోని ఉద్యోగులు ఆ పాత జిల్లాలు, జోన్లు, మట్లీ జోన్ల పరిధిలోని కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, మల్టీ జోన్లలో తాము కోరుకున్న చోటుకు వెళ్లడానికి ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది.

ఈ ఆప్షన్లను కేడర్ పోస్టులో సీనియారిటీ ప్రాతికన నిర్ణయించింది. ఈ ఆప్షన్లను సమర్పించడానికి ఉద్యోగులకు జిల్లా స్థాయిలో వారం రోజుల సమయం, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో మూడు వారాల సమయం కేటాయించింది. ఈ మార్గదర్శకాలు తీవ్ర ఆందోళనలకు దారితీశాయి. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొందురు ఉద్యోగులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు కూడా ఈ జీవో రద్దుకు మద్దతు పలికాయి. రద్దు చేయాలని బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షాలు రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. ఇదే డిమాండ్‌తో అప్పట్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిరసనకు దిగడంతో విపత్తు చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆయనను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ అంశం అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.

Tags:    

Similar News