హైదరాబాద్‌లో పాములకూ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కేంద్రం
ఆధునిక వసతులతో ఏర్పాటైన పాముల ఆశ్రమం ఇదీ...హైదరాబాద్ పాముల గేటెడ్ కమ్యూనిటి...;
By : Shaik Saleem
Update: 2025-08-22 12:04 GMT
తెలంగాణ రాష్ట్రంలో పాముల రక్షణ, పునరావాసం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నగర శివార్లలో పాముల రక్షణ, పునరావాస కేంద్రాన్ని రాష్ట్ర అటవీశాఖ స్థాపించింది. పాములు, మనుషుల మధ్య సంఘర్షణను నివారించడంతోపాటు జనవాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకొని వాటిని దట్టమైన అడవుల్లో వదిలివేసేందుకు ఈ కేంద్రాన్ని తెలంగాణ అటవీ శాఖ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసింది.
19వేల పాముల సంరక్షణ
ఇళ్లలోకి వస్తున్న పాములను ఫ్రండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాలంటీర్లు పట్టుకొని వాటిని స్నేక్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కేంద్రానికి (Snake Rescue and Rehabilitation Centre) తరలించి వాటికి చికిత్స అందించి అడవుల్లో వదిలివేస్తారు. ఇప్పటి వరకు ఈ ఎస్ఆర్ఆర్‌సీ నుంచి 19 వేలకు పైగా పాములను సంరక్షించి వాటిని అడవుల్లో వదిలి జీవవైవిధ్యాన్ని పరిరక్షించింది. ఏటా వేలాది పాములను సంరక్షించి జీవివైవిధ్యాన్ని పెంపొందిస్తోంది. పాములు కప్పలు, ఎలుకలను తినడం వల్ల వీటి సంఖ్య అదుపులో ఉంటుందని తెలంగాణ అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారి ఎ శంకరన్ చెప్పారు. ఎలుకలను పాములు నియంత్రించడం వల్ల పంట నష్టాన్ని తగ్గించవచ్చాన్నారు. జీవవైవిధ్యం కోసం తాము పాముల పరిరక్షణ, పునరావాస కేంద్రాన్ని నడుపుతున్నామని శంకరన్ వివరించారు.
40 కి పైగా స్నేక్ ఎన్‌క్లోజర్‌లు
హైదరాబాద్ స్నేక్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కేంద్రం (ఎస్ఆర్ఆర్‌సీ)లో 40కు పైగా 40 కి పైగా పాముల ఎన్‌క్లోజర్‌లు ఉన్నాయి. ఈ కేంద్రంలో 200 దాకా రక్షించిన పాములను సహజ ఆవాసాలను ప్రతిబింబించేలా స్నేక్ ఎన్‌క్లోజర్లలో ఉంచుతారు.ఈ ఎన్‌క్లోజర్లలో దుంగలు, రాళ్లు, మొక్కలు, నీటి వనరులను ఏర్పాటు చేశారు.
స్నేక్ ఎన్‌క్లోజర్లలో ఎన్నెన్నో సౌకర్యాలు
స్నేక్ ఎన్‌క్లోజర్లలో పాముల కోసం పలు సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పాముల సంచారానికి అనువుగా హీట్ ప్యాడ్ లు, ఇన్ ఫ్రారెడ్ బల్బులు, అతినీలలోహిత లైట్లు, పాములకు ఆహారంగా కావాల్సిన ఎలుకలను ఈ ఎన్‌క్లోజర్లలో అందుబాటులో ఉంచారు.
గాయపడిన పాములకు పశువైద్యుల చికిత్స
మంత్రగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న పాములకు పశువైద్యులు చికిత్స అందిస్తున్నారు.మంత్రగాళ్లు పాములను బుట్టల్లో బంధించి వాటిని ఆడించడానికి వీలుగా పాముల కోరలు పీకి, ముఖం కుట్టేసినపుడు అవి గాయాల పాలవుతుంటాయి. పాములకు అయిన గాయాలకు చికిత్స అందించి వాటికి ఇన్ఫెక్షన్ సోకకుండా సంరక్షిస్తుంటారు. ఇలా నాగుల చవితి సందర్భంగా మంత్రగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న పలు పాములకు చికిత్స అందించి వాటిని తిరిగి అడవుల్లో వదిలివేస్తున్నారు.పాము పెట్టిన గుడ్ల నుంచి దాని పిల్లలను పొదిగించే సౌకర్యం ఉంది. పాము పిల్లల కోసం ఇంక్యుబేటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని స్నేక్ సొసైటీ ప్రతినిధి డి వెంకట్ చెప్పారు.
వేసవిలో పాములకు ఎయిర్ కూలర్లు
వేసవికాలంలో పాముల పునరావాస కేంద్రంలో ఉంచిన పాములకు ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేసి తేమ ఉండేలా చేస్తున్నామని ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ కార్యదర్శి అవినాష్ ఆనంద్ చెప్పారు. తమ వాలంటీర్లు రక్షించిన 200 పాములను ఉంచి రెండు నెలలకు ఒకసారి అటవీశాఖ అధికారుల సమక్షంలో వీటిని దట్టమైన అడవుల్లో వదిలివేస్తున్నామని తెలిపారు.పాములపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి వీటితో సహజీవనాన్ని ప్రోత్సహించేలా అవగాహన కల్పిస్తున్నారు.
పాములపై ప్రజలకు అవగాహన
హైదరాబాద్ స్నేక్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కేంద్రం (ఎస్ఆర్ఆర్‌సీ )లో పాములపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి వీటితో సహజీవనాన్ని ప్రోత్సహించేలా అవగాహన కల్పిస్తున్నామని ఈ కేంద్రం వాలంటీర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. విద్యార్థులే కాకుండా పాముల ప్రేమికులకు పాముల జీవనశైలిపై శిక్షణ ఇస్తున్నారు.
వివిధ జాతుల పాములపై పరిశోధనలు
హైదరాబాద్ స్నేక్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కేంద్రం (ఎస్ఆర్ఆర్‌సీ )లో పాములను పరిరక్షించడమే కాకుండా వీటిపై పరిశోధనలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంచరిస్తున్న పాములు, వాటి జాతుల గురించి వెటర్నరీ వైద్యులు, జీవశాస్త్ర నిపుణులు పరిశోధనా పత్రాలను ప్రచురిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్న గిరినాగులు తాజాగా తెలంగాణలోనూ ఉన్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. దీనిపై తాము త్వరలో అంతర్జాతీయ మేగజైన్లలో పరిశోధనాపత్రాన్ని ప్రచురిస్తున్నామని అవినాష్ విశ్వనాథన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ పాముల రక్షణ కేంద్రం అరుదైన పాము జాతులు అంతరించి పోకుండా సెంటర్ ఫర్ సెల్యూలార్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)తో కలిసి పరిశోధనలు సాగిస్తుంది. వివిధ రకాల పాముల లైంగికత, పాముల్లో విష వైవిధ్యాలపై పాముల పునరావాస కేంద్రంలోని జీవశాస్త్ర నిపుణులు అధ్యయనం చేస్తుదన్నారు. మేడ్చల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డాక్టర్ కార్తికేయన్ వాసుదేవన్ కొంత మంది రీసెర్చ్ స్కాలర్లతో కలిసి పాములపై పరిశోధనలు చేస్తున్నారు.