ఎస్సీ వర్గీకరణ జీవొ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
దేశంలో ఎస్సీకులాల వర్గీకరణను చేపట్టిన తొలిరాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు;
తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ (SC ccategorization) అమలు చేస్తూ సోమవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు (GO) విడుదల చేసింది. షెడ్యూల్డ్ కులాల సమూహంలో మొత్తం 56 కులాలు ఉన్నాయి. వాటిని ఆయా కులాల సాంఘిక వెనకబటు తనం ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం మూడు గ్రూపులుగా విభజించింది. ఇందులో A గ్రూపునకు 1 శాతం, B గ్రూపునకు 9 శాతం, C గ్రూపునకు 5 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించింది. ఈ మేరకు తెలుగు, ఇంగ్లీష్, ఊర్దూ భాషల్లో గెజిట్ విడుదల చేసింది. గ్రూప్-1లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన 15 కులాలను చేర్చి 1 శాతం రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్-2లో మాదిగ, దాని ఉపకులాల (18)కు 9 శాతం, గ్రూప్-3లో మాల, దాని ఉప కులాల (26)కు ఐదు శాతం కేటాయించింది. గ్రూప్-1లో 1,71,625 మంది, గ్రూప్-2లో 32,74,377 మంది, గ్రూప్-3లో 17,71,682 మంది ఉన్నారు.
ఈ జీవో తొలి కాపీనీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సచివాలయంలో అందజేశారు. అనంతరం పత్రికలతో మాట్లాడిన నీటి పారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు చరిత్రాత్మకమైనదిగా వర్ణించారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాంమని ఆయన ఆయన చెప్పారు. “ ఎస్సీ వర్గీకరణ కావాలని అన్ని పార్టీల వారు మాట్లాడారు కానీ ఏ పార్టీ కూడా నిజాయితీగా ప్రయత్నం చేయలేదు. అందుకే జాప్యం జరిగింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ వర్గీకరణ కోసం నిజాయితీ గా కృషి ప్రారంభమయింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు పాస్ అయింది. గవర్నర్ సంతకం చేశారు.బిల్లు చట్టమయింది. అంబేడ్కర్ జయంతిన సామాజిక స్ఫూర్తితో ఎస్సీ వర్గీకరణను ఏప్రిల్ 14 నుంచి అమలు చేస్తున్నాం. అందుకే ఈ రోజు జీవొ విడుదల చేశాం,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
రానున్న రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ 2026లో జరిగే జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా ఎంత పెరిగితే రిజర్వేషన్లు అదే దామాషాలో పెరుగుతాయనని కూడా ఉత్తమ్ చెప్పారు.
“ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు, సామాజిక న్యాయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అనేందుకు నేటి జివొ నిదర్శనం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రం తెలంగాణ,” అని అన్నారు.
గత నెల 17న ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, మార్చి 18న అసెంబ్లీ ఆమోదించింది. మార్చి 19న శాసనమండలి ఆమోదం తెలిపింది.
ఆగస్టు 1, 2024న, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగలను ఉప-వర్గీకరణ చేయడం సబబే నని సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది.
తర్వాత 2014 అక్టోబర్ నెలలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం షెడ్యూల్డ్ కులాల ఉప-వర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం నిర్వహించడానికి తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ తో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 3న షమీమ్ అక్తర్ తన నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీకి సమర్పించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. మార్చి 18న ఈ జస్టిస్ అక్తర్ రిపోర్టు సూచనల ప్రకారం తయారయిన బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది.