తెలంగాణ అంతటా బెటాలియన్ పోలీసుల ఆందోళన..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Update: 2024-10-26 07:31 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలో పోలీసు అధికారులతో పాటు, కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబీకులు కూడా పాల్గొన్నారు. వరంగల్‌లోని మామునూరులోని బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ వద్ద 4వ బెటాలియేన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేపట్టారు. అదే విధంగా నల్గొండ గ్రామీణ ఎస్ఐ సైదాబాబుకు కూడా నిరసన సెగ గట్టిగానే తగిలింది. ఎస్ఐ గోబ్యాక్ అంటూ 12వ బెటాలియన్ కానిస్టేబుల్లు నినాదాలు చేశారు. పోలీసుల కుటుంబీకులపై దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఎస్‌ఐకి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కొన్ని రోజులుగా బెటాలియన్ పోలీసులు విధివిధానాలపై తీవ్ర దుమారం జరుగుతోంది. తమ భర్తలను ఒకే చోట విధుల్లో ఉంచాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఇదే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. వారి సెలవుల రద్దు ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

బెటాలియన్ పోలీసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణలో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళన దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది. బెటాలియన్ పోలీసుల సెలవుల రద్దు విషయంలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను మానవీయకోణంతో పరిష్కరించాలని యోచిస్తున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల సెలవులను రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన తమ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో చర్చించాలని కూడా సర్కార్ యోచిస్తోంది.

కానిస్టేబుళ్ల భార్యల డిమాండ్ ఇదే..

తెలంగాణలో పలు జిల్లాల్లోని పోలీస్ బెటాలియన్ అధికారుల భార్యలు ఒకే డిమాండ్‌తో రొడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు. తెలంగాణలో కూడా ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో భాగంగా వారంతా కలిసి సచివాలయం ముట్టడికి కూడా ప్రయత్నించారు. ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేసి తమ భర్తలకు, కుమారులకు ఒకే ప్రదేశంలో డ్యూటీ వేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నోటిఫికేషన్, పరీక్షలు ఒక్కటే అయినప్పుడు ఉద్యోగ నిబంధనలు కూడా అందరికీ ఒకేలా ఉండాలని, అలా కాకుండా తమ భర్తలు, కుమారులనే కుటుంబాలకు దూరంగా ఉంచేలా ఆదేశాలు ఇవ్వడం ఏంటని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబీకులకు వత్తాసుగా ఇప్పుడు పలు జిల్లాల్లో బెటాలియన్ పోలీసులు కూడా నిరసనకు బైఠాయించారు.

Tags:    

Similar News