స్పోర్ట్సు హబ్‌గా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.ఎల్​బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్​ 2024 ను ప్రారంభించిన తర్వాత సీఎం మాట్లాడారు.

Update: 2024-10-03 14:02 GMT

హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదికగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.ఎల్​బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్​ 2024 క్రీడల పోటీలను ప్రారంభించిన సీఎం ఈ సందర్భంగా మాట్లాడారు. మస్కట్, లోగో, పోస్టర్లను సీఎం విడుదల చేశారు.

- 25 ఏళ్ల క్రితం కామన్వెల్త్ , ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించి హైదరాబాద్ క్రీడలకు తలమానికంగా నిలబడిందని సీఎం గుర్తు చేశారు.తెలంగాణ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో క్రీడలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని సీఎం చెప్పారు.

యువత క్రీడల వైపు దృష్టి సారించాలి
హైదరాబాద్ నగర యువత క్రీడల వైపు దృష్టి సారించాలని సీఎం కోరారు.యువత క్రీడల వైపు చూడకుండా వ్యసనాలకు బానిసలు అవుతున్నారని, ఇది బాధ కల్గిస్తోందన్నారు.నిఖత్ జరీన్ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇండియా కు బాక్సింగ్ లో తలమానికంగా మారారని ఆయన పేర్కొన్నారు.‘‘నిఖత్ జరీన్ కు డీఎస్సీ ఉద్యోగం ఇచ్చాం..తెలంగాణలో క్రీడల్లో రాణిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనడానికి నిఖత్ జరీన్ నిదర్శనం’’ అని రేవంత్ పేర్కొన్నారు. నిబంధనలు సడలించి క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు డీఎస్సీ ఉద్యోగం ఇచ్చామని సీఎం గుర్తు చేశారు.

హైదరాబాద్ క్రీడలకు వేదిక కావాలి
పీవీ సింధు, అజారుద్దీన్ లాంటి హైదరాబాదీలు దేశానికే పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారని, పుట్ బాల్ కోచ్ రహీమ్ సార్ హైదరాబాద్ నగరానికి చెందిన వారు కావడం గర్వకారణం రేవంత్ అన్నారు.హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావాలని అండర్ 17 పుట్ బాల్ నేషనల్ టీం ను తెలంగాణ దత్తత తీసుకుందని సీఎం చెప్పారు.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ
చిన్న దేశం దక్షిణ కొరియాలో ఒలంపిక్స్ లో 36 పతకాలు సాధించిందని, అదే స్ఫూర్తితో తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు.యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామని,దక్షిణ కొరియా కోచ్ లను ఇక్కడికి రప్పించి శిక్షణ ఇప్పిస్తామని ఆయన హామి ఇచ్చారు.2028 ఒలింపిక్స్ లో దేశం తరుపున తెలంగాణ క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.





Tags:    

Similar News