దేశంలోనే తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం

దేశంలోనే ఏ నాయకుడు చేయని పని చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

By :  Vanaja
Update: 2024-05-03 12:56 GMT

రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ నాయకుడు చేయని పని చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. తన పేరు మీద ఉన్న ఆస్తులతో పాటు, తన కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చారు. ఈరోజు ఆయన ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తనకి, తన కుటుంబానికి చెందిన ఆస్తులన్నీ ప్రభుత్వానికి బాండ్ రూపంలో రాసిచ్చారు.

అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటిది కాదు. గతంలో ఆయన ఒక ప్రకటన చేశారు. తాను ఏ రోజైతే రాజకీయ నాయకుడిగా ప్రజల్లోకి వస్తారో, అదే రోజు తన ఆస్తిని, తన కుటుంబ ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వానికి రాసిస్తా అని బహిరంగ ప్రకటన చేశారు. చెప్పినట్టుగానే ఆస్తి రాసిన బాండ్ పేపర్స్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇచ్చి సీఎస్ కి సమర్పించాలని కోరారు.

అనంతరం మల్లన్న మాట్లాడుతూ... నేను ఈరోజు నామినేషన్ పత్రాల్లో రాసిన ఆస్తులు పరిశీలించి పెట్టుకోండి.. అప్పుడే నేను చనిపోయిన తర్వాత నా ఆస్తులు ఏమున్నాయో మీరు పరిశీలించుకునే అవకాశం ఉంటుందని తీన్మార్ మల్లన్న ప్రజలని కోరారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసాకి జవాబుదారీగా ఉంటానని అన్నారు. నేను క్లీన్ గా రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నా, క్లీన్ గా ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకుంటున్నా.. నాపై పోటీ చేసే నాయకులు కూడా అలానే రావాలని సవాల్ విసిరారు.

కాగా, తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. ఆయన 1983, జనవరి 17న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, మాధాపురం గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి హైదరాబాదు జె.ఎన్.టి.యు నుండి 2009లో ఎంబీఏ పూర్తి చేశాడు.

తీన్మార్ మల్లన్న ఎన్ టీవీ, ఐ న్యూస్ వంటి ఛానెల్స్ లో పనిచేసి 2012లో వి6 న్యూస్ లో ప్రసారమైన తీన్మార్ వార్తల ద్వారా మంచి గుర్తింపు పొందాడు. అనంతరం 10 టీవీలో కొంతకాలం పనిచేసి సొంతంగా క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశాడు.

మల్లన్న 2015లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో ఖమ్మం-వరంగల్-నల్గొండ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఆయన 2019లో జరిగిన హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. 2021, మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో ఖమ్మం-వరంగల్-నల్గొండ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచి ఓటమిపాలయ్యాడు. తీన్మార్ మల్లన్న 2021 డిసెంబరు 7న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు.

Tags:    

Similar News