ఢిల్లీలో తెలంగాణ విద్యార్థిని మృతి.. ఇద్దరు అరెస్ట్

భారీ వర్షం కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌ లో విషాదం చోటుచేసుకుంది.

By :  Vanaja
Update: 2024-07-28 12:52 GMT

భారీ వర్షం కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌ లో విషాదం చోటుచేసుకుంది. రావ్ స్టడీ సర్కిల్ సెల్లార్ లోకి వరద పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు విద్యార్థులు, ఒక విద్యార్థి చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను వెలికితీసిన తర్వాత వారి వివరాలు సేకరించారు. తెలంగాణకి చెందిన సోనీ తానియా (25), ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన శ్రేయ యాదవ్ (25), కేరళకి చెందిన నెవిన్ డాల్విన్ (28) గా గుర్తించారు.

కాగా, సోనీ తల్లిదండ్రులు సికింద్రాబాద్ కి చెందినవారు. ఆమె తండ్రి వృత్తిరీత్యా ప్రస్తుతం మంచిర్యాలలో ఉంటున్నారు. సోనీ తండ్రి విజయ్ కుమార్ సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. శ్రీరాంపూర్ -1 లో భూగర్భగని మేనేజర్ గా పని చేస్తున్నారు. ఏడాది క్రితం ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో సోనీ కోచింగ్‌ సెంటర్‌లో చేరింది. దురదృష్టవశాత్తు వరదలో చిక్కుకుని మరణించింది. కుమార్తె మృతదేహాన్ని హ్యాండోవర్ చేసుకుని, మంచిర్యాలకు తీసుకురావడానికి ఇప్పటికే సోనీ తల్లిదండ్రులు న్యూఢిల్లీ చేరుకున్నారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే...

ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌ పరిసరాల్లో శనివారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య 31.5 మిమీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో వరద నీరు ఒక్కసారిగా సెల్లార్‌లోని లైబ్రరీ రూంలోకి ప్రవేశించాయి. చనిపోయిన ముగ్గురు విద్యార్థులు అప్పుడు లైబ్రరీలోనే ఉన్నారు. అయితే లైబ్రరీకి బయోమెట్రిక్ యాక్సెస్ ఉంది. అదే సమయంలో పవర్ కట్ అవడంతో బయోమెట్రిక్ పనిచేయక విద్యార్థులు బయటకి రాలేకపోయారు. 10 నుంచి12 అడుగుల మేర నీళ్లు చేరడంతో లైబ్రరీ గదిలో ఉండిపోయిన విద్యార్థులు నీటమునిగి ఊపిరి ఆడక చనిపోయినట్లు ఇతర విద్యార్థులు చెబుతున్నారు.

మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం..

ఘటనపై విచారణ ప్రారంభించి 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిషి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్‌ను ఆదేశించారు. ఈ సంఘటన ఎలా జరిగిందో దర్యాప్తు చేయడానికి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. 'ఈ ఘటనకు బాధ్యులైన వారెవరూ తప్పించుకోలేరు' అని అతిషి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు సెల్లార్లలో వాణిజ్య కార్యకలాపాలు నిర్యహించే సంస్థలపై నగరవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని మేయర్ ఒబెరాయ్ ఆదేశించారు.

రావ్ స్టడీ సెంటర్ యజమాని అరెస్ట్..

రావ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఓనర్ అభిషేక్ గుప్తా, కో-ఆర్డినేటర్ దేశ్ పాల్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఓనర్ అభిషేక్ గుప్తా, కో-ఆర్డినేటర్ దేశ్ పాల్ సింగ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రావ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు సెల్లార్‌ లో తమ విద్యార్థుల కోసం లైబ్రరీ ఏర్పాటు చేశారు. భవన నిర్మాణం పూర్తయ్యాక 2021లో తీసుకున్న సర్టిఫికెట్‌ లో సెల్లార్‌ ను పార్కింగ్ కోసం మాత్రమే వినియోగిస్తామని భవన యజమాని రాసిచ్చాడని, అయితే అందులో లైబ్రరీని ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News