కవిత బెయిల్ పిటిషన్ ; ఈడీ పై సుప్రీం సీరియస్

మంగళవారం జస్టిస్ గవాయి, జస్టిస్ కె. విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది.

By :  Vanaja
Update: 2024-08-20 09:46 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 27కు విచారణ వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. మంగళవారం జస్టిస్ గవాయి, జస్టిస్ కె. విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి ఈడి మరికొంత సమయం కోరడంతో అత్యున్నత న్యాయస్థానం విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

మరోవైపు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఆలస్యం ఎందుకని ప్రశ్నించింది. ఈనెల 27 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే శుక్రవారం లోపు కవిత తరపు న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని సూచించింది. విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి.. మహిళగా కవిత బెయిల్ కి అర్హురాలని తెలిపారు. ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేశారని, కవితకు కూడా బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణ పూర్తయిందని, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసినందున బెయిల్ మంజూరు చేయాలని రోహత్గి కోరారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టు బెయిల్ నిరాకరించాయి. దీంతో బెయిల్ పై సుప్రీంకోర్టు పైనే ఆశలు పెట్టుకున్నారు. తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (క్రిమినల్‌) దాఖలు చేశారు. 

Tags:    

Similar News