కవితకి బెయిల్... సీఎంపై సుప్రీంకోర్టు సీరియస్

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

By :  Vanaja
Update: 2024-08-29 11:11 GMT

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం.. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పుపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సీఎం రేవంత్‌ కు తగునా అని ప్రశ్నించింది. ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా... సర్వోన్నత న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదించడం సరికాదని సుప్రీం హితవు పలికింది.

రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా అని ధర్మాసనం మండిపడింది. ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదా. ఇలా ఎలా మాట్లాడతారు అంటూ నిలదీసింది. "మేము ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోము. మా విధి మేము నిర్వహిస్తాము. మేము ప్రమాణ పూర్వకంగా పనిచేస్తాము. ఎవరి పనుల్లోనూ జోక్యం చేసుకోము. సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా? వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలి కదా. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా రేవంత్ రెడ్డికి ఆయన తరపు న్యాయవాదులు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇలాంటి ప్రవర్తన ఉంటే.. ఓటుకు నోటు కేసు విచారణ రాష్ట్రం బయటే నిర్వహిద్దాం" అంటూ జస్టిస్ గవాయి ధర్మాసనం సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

విచారణ వాయిదా...

ఇక కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్ ని నియమిస్తున్నట్లు పేర్కొంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం స్పెషల్ ప్రాసిక్యూటర్ ని నియమించే ప్రయత్నం చేసింది. అనంతరం కేసు విచారణ సోమవారానికి (సెప్టెంబర్ 2) వాయిదా వేసింది.

ఇంతకీ రేవంత్ ఏమన్నారంటే...

కవితకి బెయిల్ రావడంపై బుధవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్, బీజేపీ మైత్రీవల్లే ఆమెకి బెయిల్ వచ్చిందని విమర్శించారు. "పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ బీజేపీకి ట్రాన్స్‌ఫర్ చేశారు. అందుకే కవితకు ఐదు నెలల్లో బెయిల్ వచ్చింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, సిసోడియాకు నెలలు దాటినా రాలేదు. బీఆర్‌ఎస్‌కు ఒక న్యాయం, మిగితా వారికి మరో న్యాయం జరుగుతుంది" అని సీఎం ఆరోపించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపైనే సుప్రీం కోర్టు సీరియస్ అయింది.

Tags:    

Similar News