'ఓటుకు నోటు' కేసులో సుప్రీం కీలక నిర్ణయం

ఓటుకు నోటు కేసులో సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం జస్టిస్ గవాయ్ ధర్మాసనం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిందితుడుగా ఉన్న ఈ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది.

By :  Vanaja
Update: 2024-08-29 10:56 GMT

ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం జస్టిస్ గవాయ్ ధర్మాసనం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిందితుడుగా ఉన్న ఈ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్ ని నియమిస్తున్నట్లు పేర్కొంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం స్పెషల్ ప్రాసిక్యూటర్ ని నియమించే ప్రయత్నం చేసింది. అనంతరం కేసు విచారణ సోమవారానికి (సెప్టెంబర్ 2) కి వాయిదా వేసింది.

కేసు విచారణ బదిలీకి పిటిషన్...

2015 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఓటుకు నోటు వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు. అయితే రేవంత్ ఇప్పుడు సీఎంగా ఉండటంతో ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ కి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, దర్యాప్తు సంస్థ ఏసీబీ చూసే హోం శాఖ కూడా ఆయన వద్దని జగదీశ్వర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మహబూబ్నగర్ లో జరిగిన ర్యాలీలో పలుమార్లు పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే ఈ కేసు పై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందన్న జగదీశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది.. ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్లో కూడా వైఖరి మారిందని వెల్లడించారు.

స్పెషల్ ప్రాసిక్యూటర్...

పిటిషనర్ వాదనలపై జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని స్పష్టం చేశారు. ట్రయల్ జరిగే విషయం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున ఈ కేసు విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్ని నియమిస్తామన్నారు. విశ్వసనీయతను పెంచేందుకే స్వతంత్ర ప్రాసిక్యూటర్ని నియమిస్తామని వెల్లడించారు. 2024 ఎన్నికల తర్వాతే మీరు కోర్టుకు వచ్చారు.. ఎందుకు? మన న్యాయవ్యవస్థ పై మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. అందరి అనుమానాలను నివృత్తి చేసేందుకు స్పెషల్ ప్రాసిక్యూటర్ని నియమిస్తాం. ఏపీ లేదా తెలంగాణ నుంచి, ప్రతి ఒక్కరి మనసులో విశ్వాసముండేలా, మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్ ను నియమిస్తాం. తెలంగాణకు చెందిన మా సహచరులను సంప్రదించి ఈ నియామకాన్ని మేమే పర్యవేక్షిస్తాం. ప్రత్యేక ప్రాసిక్యూటర్ని నియమించే వ్యవహారాన్ని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది" అని జస్టిస్ గవాయ్ వెల్లడించారు.

ఇక లంచ్ బ్రేక్ తర్వాత ఓటుకు నోటు పిటిషన్లపై మరోసారి విచారణ జరిపింది ధర్మాసనం. ప్రత్యేక ప్రాసిక్యూటర్ ని నియమించేందుకు ప్రయత్నించింది. ఇరుపక్షాల నుంచి ఇద్దరు పేర్లను తీసుకుంది. అయితే ఉమామహేశ్వరరావు, అశోక్ దేశాయి పేర్లపై ఇరు వర్గాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక సోమవారం విచారణ నాడే ఆ ప్రక్రియను కూడా ధర్మాసనం పర్యవేక్షించే అవకాశం ఉంది. 

Tags:    

Similar News