Supreme Court | తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత.. సుప్రీంకోర్టులో విచారణ
ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు ఎంత సమయం కావాలి? కనుక్కుని చెప్పమన్న సుప్రీంకోర్టు.;
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఫిరాయింపులను సహించమని గప్పాలు కొట్టిన కాంగ్రెస్(Congress).. ఎందుకు బీఆర్ఎస్(BRS) నేతలను ఎందుకు పార్టీలోకి ఆహ్వానిస్తోందని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ జెండాతో ఎన్నికల్లో విజయం సాధించి అధికారం కోసం సిద్ధాంతాలను తుంగలో తొక్కి, పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన నేతలు వదిలి పెట్టమంటూ బీఆర్ఎస్ పెద్దలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అతి త్వరలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని, తెలంగాణలో ఉపఎన్నికలు రావడం తధ్యమని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై బీఆర్ఎస్.. హైకోర్టు(High Court)ను ఆశ్రయించినప్పటికీ అక్కడ ఆశించిన ఫలితం రాలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ స్పీకర్‌దే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు ఆదేశాలను బీఆర్ఎస్.. సుప్రీంకోర్టు(Supreme Court)లో సవాల్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జి మైస్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
పిల్ ఏమని వేశారంటే..
పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ జెండాపై గెలిచి.. ఆ తర్వాత అధికారం కోసం పార్టీ మారిపోయారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 9 నెలల క్రితమే స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని బీఆర్ఎస్ తెలిపింది. అయినా ఇప్పటి వరకు తాము పేర్కొన్న పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ తన పిటిషన్లో పేర్కొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చి కూడా ఆరు నెలలు అవుతున్నా స్పీకర్ ఇప్పటి వరకు చర్యలకు ఉపక్రమించలేదని, కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. ఫిరాయింపు నేతల అంశంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఇప్పటికే నోటీసులిచ్చాం..
ఫిరాయింపుల అంశంపై ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు అందించినట్లు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. న్యాయస్థానానికి తెలిపారు. ఈ సందర్భంగానే ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎమ్మెల్యేలకు స్పీకర్ తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రోహత్గీ గుర్తు చేశారు. ఈ క్రమంలో ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో స్పీకర్‌ను కనుక్కుని చెప్పాలని ధర్మాసనంసూచించింది. అనంతరం తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
హైకోర్టు ఆదేశాలివే..
అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్దేనని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. కాగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం షెడ్యూల్ 10 ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించింది. ఐదేళ్ల గడువు ఉన్న క్రమంలో స్పీకర్ నిర్ణయాలను నిర్దేశించలేమని వెల్లడించింది. ఈ తీర్పుతో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార విభజన ఉంటుందని, ఒక వ్యవస్థ వ్యవహారాల్లో మరో వ్యవస్థ జోక్యం చేసుకోవదని, చేసుకోవడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసినట్లయింది.