Niloufer Doctors | సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు...
ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న సుడాన్ దేశానికి చెందిన నవజాత శిశువుకు మెరుగైన చికిత్స అందించిన నిలోఫర్ వైద్యులకు ఆ దేశ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.;
By : Shaik Saleem
Update: 2024-12-31 14:58 GMT
సుడాన్ దేశానికి చెందిన 43 ఏళ్ల మహిళకు అయిదు సార్లు గర్భస్రావం అయింది.దీంతో బిడ్డ కోసం ఏళ్ల తరబడిగా తహతహలాడిన సుడాన్ దేశ దంపతులు ఏడాది క్రితం ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) చికిత్స కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. హైదరాబాద్ నగరంలోని ఆసుపత్రిలో ఐవీఎఫ్ విజయవంతమవడంతో సుడాన్ మహిళ ఈ ఏడాది నవంబర్ నెలలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
శిశువుకు ఆరోగ్య సమస్యలు
పుట్టిన శిశువుకు రక్తం, మెదడు ఇన్ఫెక్షన్లతోపాటు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.దీంతో శిశువు పరిస్థితి విషమంగా మారడంతో ఆరు రోజులపాటు ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స చేశారు. అయితే సుడాన్ దంపతుల ఆర్థిక స్థోమత సరిగా లేని కారణంగా, ఆ దంపతులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగించలేక వైద్య సహాయం కోసం నిలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు.
నిలోఫర్ వైద్యులకు కృతజ్ఞతలు
పుట్టుకతోనే తీవ్రమైన రక్తం, మెదడు ఇన్‌ఫెక్షన్‌లతో పాటు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న సుడాన్ శిశువుకు నిలోఫర్ వైద్యులు నెల రోజుల పాటు మెరుగైన చికిత్స అందించడంతో బాబు పూర్తిగా కోలుకున్నాడు.వైద్యులు అంకితభావంతో తమ బిడ్డ కోలుకునేలా చికిత్స చేశారని సుడాన్ దంపతులు నిలోఫర్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
డాక్టర్లకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రశంసలు
తమ బిడ్డ పుట్టినప్పుడు అతని పరిస్థితి విషమించిందని, కానీ నిలోఫర్‌లోని వైద్యులు తమ బిడ్డకు మెరుగైన చికిత్స అందించి రక్షించారని సుడాన్ దంపతులు డాక్టర్లను ప్రశంసించారు.నిలోఫర్ ఆసుపత్రిలోని నియోనాటాలజిస్ట్ డాక్టర్ స్వప్న శిశువు పూర్తిగా కోలుకున్నట్లు ధృవీకరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్, తెలంగాణ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ లు సుడాన్ దేశ శిశువుకు చికిత్స చేయడంలో అసాధారణమైన కృషి చేసిన వైద్య బృందాన్ని ప్రశంసించారు.