నేవీ రాడార్ ప్రాజెక్టును నిలిపివేయండి,మేధావుల లేఖ
దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో 44 మంది పర్యావరణ ప్రేమికులు ఈ ప్రాజెక్టును ఆపాలని కోరుతూ కేంద్రానికి, సీఎంకు లేఖ రాశారు.
By : Shaik Saleem
Update: 2024-10-14 12:48 GMT
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టుకు ఈ నెల 15వతేదీన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం ఎ రేవంత్ రెడ్డి పాల్గొననున్న నేపథ్యంలో తెలంగాణ పర్యావరణ ప్రేమికులు, మేధావులు బహిరంగ లేఖ రాశారు.
- తెలంగాణలోని దామగుండం అడవుల్లో నేవీ రాడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయవద్దంటూ దామగుండం అడవి అనే స్వతంత్ర ప్రజా పోరాట యాత్ర,తెలంగాణ సేవ్ దామగుండం ఫారెస్ట్ ఫోరం,పర్యావరణ ప్రేమికులు, మేధావులు 44 మంది కేంద్ర పర్యావరణ, అటవీ,వాతావరణ మంత్రిత్వ శాఖకు, కేంద్ర మంత్రికి, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
- ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా నేవీ రాడార్ ప్రాజెక్టు ను అడవిని తొలగించి పెట్టడాన్ని మేధావులు తప్పు పట్టారు. దామగుండం రిజర్వు ఫారెస్ట్, సహజమైన అనంతగిరి కొండలున్న ప్రాంతంలో తూర్పు నౌకాదళ కమాండ్ రాడార్ స్టేషను ఎలా నిర్మిస్తారని వారు ప్రశ్నించారు.
- వేలాదిమంది ప్రజలు అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తుంటే అడవిని నరికి ఈ ప్రాజెక్టు పెట్టడం ఏమిటని వారు అడిగారు. ఈ ప్రాజెక్టు కోసం 8,991 చెట్లను నరుకుతామని ప్రాజెక్టు ఇన్ చార్జి అధికారి కెప్టెన్ జీఎం రావు చెప్పారని, కాని ఎక్కువ చెట్లను తొలగిస్తున్నట్లు వారు గుర్తు పేర్కొన్నారు.
లేఖ ఎవరు రాశారంటే...
దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ తెలంగాణలోని వివిధ సంఘాలకు చెందిన 44 మంది ప్రతినిధులు, పర్యావరణ వేత్తలు, మేధావులు కేంద్రానికి, సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రిటైర్డు సైంటిస్ట్, హ్యుమన్ రైట్స్ ఫోరం ప్రతినిధి డాక్టర్ కె బాబురావు, సౌత్ ఏసియా పీపుల్స్ యాక్షన్ ఫర్ క్లైమెట్ క్రైసిస్ కో కన్వీనర్ సాగర్ ధారా, పూడూరు మాజీ సర్పంచి లక్ష్మయ్య, ప్రొగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ కన్వీనర్ సంధ్య, దామగుండం జేఏసీ ప్రతినిధి వై గీత, నాపం ప్రతినిధి మీరా సంఘమిత్ర,సోషల్ యాక్టివిస్టు కొండవీటి సత్యవతి, జర్నలిస్ట్ తులసి చందు,తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రవి కన్నెగంటి తదితరులు లేఖ రాసిన వారిలో ఉన్నారు.
పర్యావరణ కార్యకర్తల ధర్నా
వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో 12 లక్షల చెట్లను నరికివేయడాన్ని నిరసిస్తూ పర్యావరణ కార్యకర్తలు ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు.దామగుండం అడవుల్లో నేవీ రాడార్ స్టేషన్‌ను ముందుకు తీసుకెళ్లవద్దని తెలంగాణ పర్యావరణ కార్యకర్తలు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కోరారు.దాదాపు 2,900 ఎకరాలకు పైగా భూమి అవసరమయ్యే ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 15న ప్రారంభించనున్నారు.దామగుండం అడవుల్లో ప్రారంభించిన ప్రాజెక్టుకు సంబంధించి బహిరంగ విచారణకు వారు డిమాండ్ చేశారు.
నేవీ రాడార్ ప్రాజెక్టుకు రేపు శంకుస్థాపన
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం ఎ రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టరులో వికారాబాద్ కలెక్టరు కార్యాలయానికి చేరుకుంటారు. హెలిపాడ్ నుంచి రోడ్డు మార్గాన బేకుల బీట్ తండా సమీపంలో పైలాన్ వద్ద కు చేరి అక్కడ నేవీ రాడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం 2,900 ఎకరాలను తెలంగాణ అటవీశాఖ నేవీకి అప్పగించింది.