రాష్ట్ర బడ్జెట్ కూడా ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితం: రేవంత్
మా ఆలోచనలో, సంకల్పంలో స్పష్టత ఉందని, తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని రేవంత్ పేర్కొన్నారు.;
రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం సమపాలల్లో ఉండాలని కోరుకున్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఉగాది పండగ సందర్భంగా ‘విశ్వావసు నామ సంవత్సర’ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సుభిక్ష పాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తీర్చడానికి తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని చెప్పుకొచ్చారు.
‘‘రాష్ట్ర ప్రజలకు విశ్వావసు నామ సంవత్సరం అందరికీ సంతోషాలను అందించాలని కోరుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ లభించాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది ఆర్థిక మంత్రి భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితం. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చాం’’ అని తెలిపారు.
‘‘విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నిటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణ రైజింగ్ అంటూ …దేశంలో తెలంగాణ ఒక వెలుగు వెలగాలి… దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలి. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి తెలంగాణ శ్రీకారం చుట్టింది. ఫ్యూచర్ సిటీ పెట్టుబడుల నగరంగా అభివృద్ధి చెందుతుంది’’ అని అన్నారు.
‘‘దేశంలోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ను తీసుకొచ్చి పేదలకు ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు పేదలకు సన్నబియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నాం. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందుభాగంలో నిలిచింది. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నాం. ఆదాయం పెంచాలి… పేదలకు పెంచాలన్నది మా ప్రభుత్వ విధానం. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు.. ఇది అభివృద్ధి చేసే సందర్భం’’ అని వ్యాఖ్యానించారు. మా ఆలోచనలో, సంకల్పంలో స్పష్టత ఉందని, తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని పేర్కొన్నారు.