తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా ప్రతిష్ఠాత్మకమైన 72 మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న నేపథ్యంలో గతంలో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న భారతభామల గురించి చర్చనీయాంశంగా మారింది. భారతదేశం పలుసార్లు మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తూ, ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. మిస్ వరల్డ్ పోటీల్లో విశ్వవిజేతలుగా ఆరగురు భారతదేశ భామలు నిలిచారు.
భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయంటే...
యునైటెడ్ కింగ్‌డమ్ వెలుపల మొదటిసారిగా భారతదేశంలో వరుసగా రెండు సంవత్సరాలు మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తోంది. 2024 వ సంవత్సరంలో మిస్ వరల్డ్ పోటీలు ముంబయి నగరంలో వేడుకగా జరిగాయి.మిస్ వరల్డ్ 72 పోటీలు ఈ ఏడాది (2025 ఎడిషన్) హైదరాబాద్‌లో జరగనున్నాయి.మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే మే 31వతేదీన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది.భారతదేశం మొదటిసారిగా 1996వ సంవత్సరంలో బెంగళూరులో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించింది. వరుసగా జరుగుతున్న ప్రస్తుత ఎడిషన్లతో 1951లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను వరుసగా యూకే తర్వాత నిర్వహించిన ఏకైక దేశంగా భారతదేశం నిలిచింది.
మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న భారత అందాల భామలు
భారతదేశానికి చెందిన ఆరుగురు అందాల భామలు మిస్ వరల్డ్ విజేతలుగా నిలిచారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఈ భామలు భారతదేశ ప్రతిష్ఠను విశ్వ వీధిలో ఇనుమడింప జేశారు.
1951వ సంవత్సరంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కాగా, మొట్టమొదటి సారి 1966వ సంవత్సరంలో భారతదేశానికి చెందిన రీటా ఫరియా (1966, మహారాష్ట్ర)మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది.
ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ (1994, కర్ణాటక),డయానా హేడెన్ (1997, తెలంగాణ), యుక్తా ముఖీ (1999, మహారాష్ట్ర), ప్రియాంక చోప్రా (2000, జార్ఖండ్)మానుషి చిల్లార్ (2017, హర్యానా) ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు.
మిస్ వరల్డ్ పోటీల్లో నందినీ గుప్తా
ఈ సంవత్సరం జరగనున్న మిస్ వరల్డ్ 72వ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.నందినీ గుప్తా ప్రపంచ వేదికపై అందం, తెలివితేటలు మిళితం చేసే దేశ వారసత్వాన్ని కొనసాగించనుంది. భారతదేశం వరుసగా మిస్ వరల్డ్‌ను హోస్ట్ చేయడం విశేషం. ప్రపంచ అందం, ఈవెంట్స్ పరిశ్రమలో భారతదేశ ప్రతిష్ఠ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
మిస్ వరల్డ్ పోటీలకు అంతా సిద్దం
ఎల్లుండి సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి (10.05.2025) సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు అధికారికంగా మొదలవుతాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం విసృత స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. ఎయిర్ పోర్టుతో సహా హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేసింది.
95 మంది ప్రపంచ సుందరీమణుల రాక
ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటికే 95 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీ దారులు హైదరాబాద్ చేరుకున్నారు. మరికొంత మంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి రానున్న రెండు రోజుల్లో వస్తారని మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. వీరికి తోడు 28 మంది మిస్ వరల్డ్ సంస్థ నుంచి నిర్వహణ ప్రతినిధులు, 17 మంది సహాయకులు వచ్చారు. గత వారం రోజులుగా వస్తున్నఅతిధులు అందరినీ తెలంగాణ సంసృతీ, సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతూ వారికి బస ఏర్పాట్లను టూరిజం శాఖ కల్పించింది. విదేశీ ప్రతినిధులు బస చేసిన ట్రిడెంట్ హోటల్ దగ్గర పోలీసులు భారీ భద్రత కల్పించారు.
తెలంగాణ కార్యక్రమాల్లో అందాలభామలు
వివిధ దేశాలకు చెందిన అందాల భామలు విభిన్న కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.వీరు తెలంగాణలో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రదేశాల సందర్శించనున్నారు.బ్రెస్ట్ కేన్సర్ నివారణ, మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా మిస్ వరల్డ్ కంటెస్ట్ లో భాగంగా చేపడుతున్నారు.తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదాన్ని విసృతంగా ప్రపంచవ్యాప్తం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా పర్యాటకరంగం పెరగటం, పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.