మొక్కుబడిగా విజిలెన్స్ వారోత్సవాలు,అక్రమార్కులపై చర్యలేవి?

తెలంగాణలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అక్రమార్కులపై రాష్ట్రప్రభుత్వానికి నివేదికలు పంపించినా , వాటిపై చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలమైంది.

Update: 2024-10-28 15:20 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాలపై నివేదికలు పంపించినా సర్కారు ఆ నివేదికలను బుట్టదాఖలా చేసింది. అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ విభాగం సమగ్ర దర్యాప్తు జరిపి, వాటిపై నివేదికలను రూపొందిస్తోంది. ఈ నివేదికల ఆధారంగా అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. దీంతో పలు ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.


అక్రమాలపై 1230 నివేదికలు
2014వ సంవత్సరం నుంచి 2024 వరకు ప్రభుత్వ శాఖల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ దర్యాప్తు చేసి అక్రమాల బాగోతాలపై 1230 నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలో 284, రెవెన్యూ శాఖలో 174, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 142, వ్యవసాయ, సహకార శాఖలో 110, నీటిపారుదల శాఖలో 73, పౌరసరఫరాల శాఖలో 64, పర్యావరణ, అటవీ శాఖలో 61, వైద్య ఆరోగ్య శాఖలో 47 అక్రమాలపై విజిలెన్స్ అధికారులు నివేదికలు సమర్పించారు.

కుంభకోణాలపై చర్యలేవి?
తెలంగాణలోని పలు ప్రభుత్వ శాఖల్లో జరిగిన భారీ కుంభకోణాలపై 768 నివేదికలను విజిలెన్స్ అధికారులు సర్కారుకు పంపించారు. దీంతోపాటు పలు శాఖల్లో అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని 1215 అప్రమత్తత నివేదికలను విజిలెన్స్ మసర్పించింది. దీంతోపాటు పలు శాఖల అధికారుల పనితీరు మెరుగునకు 123 రిపోర్టులను విజిలెన్స్ విభాగం పంపినా దీనిపైనా కూడా సర్కారు స్పందించ లేదు. దీంతో అక్రమార్కులపై చర్యలు తీసుకోక పోవడంతో వారికి భయం లేకుండా పోయిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

విజిలెన్స్ వారోత్సవాలు ప్రారంభం
తెలంగాణలో సోమవారం నుంచి విజిలెన్స్ చైతన్య వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటామని తెలంగాణ విజిలెన్స్ ఉద్యోగులు ప్రతిన బూనారు.తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాల నివారణ కోసం సోమవారం నుంచి విజిలెన్స్ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని కేంద్రప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు తెలంగాణలో విజిలెన్స్ చైతన్య వారోత్సవాలు చేపట్టారు.

అవినీతికి దూరంగా ఉంటామని ఉద్యోగుల ప్రతిన
భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా అక్టోబరు 28వతేదీ నుంచి అక్టోబరు 3వతేదీ వరకు విజిలెన్స్ చైతన్య వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బుద్ధభవన్ లోని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయంలో తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ ఎంజీ గోపాల్ విజిలెన్స్ ఉద్యోగులతో అవినీతికి దూరంగా ఉంటామని ప్రతిన చేయించారు.అవినీతిని నిరోధించాల్సిన విజిలెన్స్ వారోత్సవాలు మొక్కు బడిగా మారడంతో తెలంగాణలో పలు కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయి.


Similar News