హైదరాబాద్‌లో హైడ్రా ఉభయహస్తం: విమర్శలు,మద్దతు ర్యాలీలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో రాజుకున్న హైడ్రా వివాదం...

Update: 2025-11-09 01:16 GMT
హైడ్రాకు మద్ధతుగా ప్రజల ర్యాలీ

హైదరాబాద్ నగర రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తున్న హైద‌రాబాద్ డిజాస్టర్ రిస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ హైడ్రా పేరుతో జరుగుతున్న కూల్చివేతలు, ప్రభుత్వ భూముల సంరక్షణ చర్యలు, వాటిపై వస్తున్న విమర్శలు...ప్రశంసలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. ఒకవైపు ప్రతిపక్షం హైడ్రా చర్యలను పేదలపై దాడిగా చూపిస్తుండగా, మరోవైపు ప్రజల మద్దతు ర్యాలీలతో హైడ్రాకు అనుకూల వాతావరణం నెలకొంటోంది. మొత్తంగా, హైడ్రా ఇప్పుడు నగర అభివృద్ధి,రాజకీయాల మధ్య సున్నితమైన సమతుల్యతను పరీక్షిస్తున్న అంశంగా నిలిచింది.




 హైడ్రాపై విమర్శల వర్షం

హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో హైడ్రా అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ హైడ్రాపై వరుసగా విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.హైదరాబాద్ నగరంలో నలుమూలల ప్రజల భాగస్వామ్యంతో హైడ్రాకు మద్ధతుగా వారంరోజుల నుంచి వరుస ర్యాలీలు చేపట్టారు. ఉప ఎన్నికల వేళ హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, దీనికి దీటుగా హైడ్రాకు మద్ధతుగా వరుస ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద హైడ్రా వ్యతిరేక విమర్శలు, అనుకూల ర్యాలీలతో హైడ్రా అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.



 హైడ్రా బాధితులతో సమావేశం

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. హైడ్రా పేదలకో న్యాయం, పెద్దోళ్లకు మరో న్యాయం అనే రీతిలో పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. హైడ్రా పేదల ఇళ్లే లక్ష్యంగా పెద్ద వాళ్ల జోలికి వెళ్లడం లేదని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా బాధితులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన కేటీఆర్ పేదల ఇళ్లను కూలుస్తుందని ఆరోపించారు. ఉప ఎన్నికల వేళ హైడ్రా బీఆర్ఎస్ కు లాభం చేకూరేలా ఓవరాక్షన్ చేస్తూ ఇళ్లను కూలుస్తుందని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు.

హైడ్రాకు హైకోర్టు అక్షింతలు
హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు గతంలో పలుసార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హైడ్రాకు హైకోర్టు హెచ్చరిక కూడా జారీ చేసింది. ‘‘మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోం,కనీసం ఒక్కరోజైనా ఆగలేరా? - కూల్చివేతల్లో ఎందుకింత దూకుడు’’ అని హైకోర్టు ప్రశ్నించింది. జీవో 99ను ఉల్లంఘిస్తే, దాన్ని రద్దు చేసి హైడ్రాను మూసివేయాల్సి వస్తుందని హైకోర్టు గతంలో హెచ్చరించింది.



మరో వైపు ప్రశంసల జల్లు

ఒక వైపు ప్రతిపక్ష నేతల విమర్శల జోరు, హైకోర్టు అక్షింతలు పడుతుండగానే మరో వైపు హైడ్రాకు మద్ధతుగా ప్రజలు ర్యాలీలు చేస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పార్కులు కాపాడిన హైడ్రాకు ధన్యవాదాలు అంటూ స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్కులు కాపాడి ప్రాణవాయువును అందించిన హైడ్రా కు ధన్యవాదాలంటూ ర్యాలీ నిర్వహించారు. మూసాపేటలోని ఆంజనేయ నగర్లో పార్కుకు చేరుకుని స్థానికులు హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. బోరబండ సమీపంలోని బృందావన్ కాలని లో కూడా ర్యాలీలు నిర్వహించి హైడ్రాకు మద్దతు పలికారు.

తమ్మిడికుంటకు కొత్త రూపు
ఐటీ కారిడార్ కి,శిల్పారామానికి చేరువగా మాదాపూర్లో ఉన్న తమ్ముడికుంట చెరువు రూపు రేఖలు మార్చిన హైడ్రాకు స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఒకపుడు అసాంఘిక కార్యకలాపాలకు దుర్గంధభరిత వాతావరణంలో దోమలు, క్రిమి కీటకాలతో ఉన్న ఈ పరిసరాల రూపురేఖలను హైడ్రా మార్చింది అంటూ అభినందించారు. ర్యాలీగా వచ్చి ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.

రోడ్డు, పార్కుల ఆక్రమణలను తొలగించిన హైడ్రా
అల్మాస్ గూడ బోయపల్లి ఎన్ క్లెవ్ కాలనీలో లేఔట్ ప్రకారం ఉన్న రోడ్లు, పార్కులను హైడ్రా కాపాడిందంటూ స్థానికులు ర్యాలీ నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. మా చెరువును కాపాడారంటూ కొన్ని కాల‌నీల‌ ప్ర‌జ‌లు, మాకు వ‌ర‌ద ముప్పు త‌ప్పించార‌ని మ‌రి కొన్ని కాల‌నీల నివాసితులు హైడ్రాకు శుక్ర‌వారం అభినంద‌న‌లు తెలిపారు. మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ దేవ‌ర‌యాంజ‌ల్ విలేజ్‌లోని తుర‌క‌వాణికుంట నుంచి దేవ‌ర‌యాంజ‌ల్ చెరువుకు వెళ్లే వ‌ర‌ద కాలువ సమస్యను నెల రోజుల్లో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన హైడ్రాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.



 ముష్కిన్ చెరువును కాపాడిన హైడ్రాకు ధ‌న్య‌వాదాలు

ముష్కిన్ చెరువును కాపాడిన హైడ్రాకు స్థానికులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. శుక్ర‌వారం ఉద‌యం ర్యాలీలు నిర్వ‌హించి హైడ్రాకు మ‌ద్ద‌తు తెలిపారు. ఎఫ్ టీఎల్ పరిధిలో పోసిన మట్టిని పూర్తిగా తొలగించారు. చెరువు సహజ పరిమాణం పునరుద్ధరించడంతో సరస్సు తిరిగి తన పాత అందాన్ని సంతరించుకుంది. పోచారం మున్సిపాలిటీలోని దివ్యాన‌గ‌ర్ లేఔట్‌లో ర‌హ‌దారుల ఆక్ర‌మ‌ణ‌, పార్కుల దురాక్ర‌మ‌ణ‌ను హైడ్రా తొల‌గించింది. న‌ల్ల‌మ‌ల్లారెడ్డి కోట‌గోడ‌లు, అడ్డు గోడ‌లు బ‌ద్ధ‌లు కొట్టి 2218 మంది ప్లాట్ల‌కు విముక్తి క‌ల్పించిన హైడ్రాకు ధ‌న్య‌వాదాలంటూ మ‌రో సారి ర్యాలీ నిర్వ‌హించి అదే లే ఔట్‌లో స‌మావేశమ‌య్యారు ప్లాట్ య‌జ‌మానులు.

కాల‌నీల‌కు దారి దొరికింది
నాలుగు కిలోమీట‌ర్ల మేర ఉన్న భారీ ప్ర‌హ‌రీని కూల్చి వేయ‌డంతో.. ఏక‌శిలా లే ఔట్‌, వెంక‌టాద్రి టౌన్‌షిప్‌, సుప్ర‌భాత్‌ వెంచ‌ర్ -1 , మ‌హేశ్వ‌రి కాల‌నీ, క‌చ్చ‌వాణి సింగారం, ఏక‌శిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీన‌గ‌ర్‌, సుప్ర‌భాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాల‌నీ, ప్ర‌తాప్ సింగారం రోడ్డు, సుప్ర‌భాత్ వెంచ‌ర్ -2, 3, సాయిప్రియ‌, మేడిప‌ల్లి, ప‌ర్వ‌త‌పురం, చెన్నారెడ్డి కాల‌నీ, హిల్స్ వ్యూ కాల‌నీ, ముత్తెల్లిగూడ నివాస ప్రాంతాల‌కు దారి దొరికింద‌ని ఆయా ప్రాంతాల నివాసితులు సంతోషం వ్య‌క్తం చేశారు.

అమీర్‌పేట‌, ప్యాట్నీ పరిసర కాల‌నీల ప్ర‌జ‌ల ర్యాలీలు
వరద ముప్పును తప్పించిన హైడ్రాకు పలు కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలిపారు. ర్యాలీగా వచ్చి హైడ్రాకు మానవహారంగా నిలబడ్డారు. అమీర్ పేట, శ్రీనివాస్ నగర్, గాయత్రినగర్, కృష్ణ నగర్, అంబేద్కర్ నగర్ నుంచి వచ్చినా ఆ కాలనీల ప్రతినిధులు మైత్రివనం వద్ద ప్లకార్డులను ప్రదర్శించి హైడ్రాకు సంఘీభావం తెలిపారు.ప్యాట్నీ నాలాను విస్తరించి పైన ఉన్న ఏడెనిమిది కాలనీలకు వరద ముప్పు తప్పించిన హైడ్రాకు అక్కడి వాళ్ళు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విధంగా హైడ్రాకు ప్రతికూల పరిస్థితులు, బీఆర్ఎస్ విమర్శల వర్షం, మరో వైపు మద్ధతుగా ర్యాలీలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో హైడ్రా అంశం హైదరాబాద్ నగర రాజకీయాల్లో కీలకంగా మారుతోంది.


Tags:    

Similar News