ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో నివ్వెరపోయే నిజాలు
ఎలుకలసంచారం, వాటి మలం, బొద్దింకలు,అపరిశుభ్ర పరిస్థితులు..ఇవీ హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో వెలుగు చూశాయి.
By : Shaik Saleem
Update: 2024-10-14 06:11 GMT
హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు అపరిశుభ్రతకు ఆలవాలంగా మారాయని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైంది. ఎలుకల మలం, బొద్దింకలు హోటళ్ల కిచెన్ లో దర్శనమివ్వడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్ కు గురయ్యారు.దీంతో నివ్వెర పోయిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆయా హోటళ్లపై కేసులు నమోదు చేశారు.
- సికింద్రాబాద్ లోని బ్లూ సీ టీ అండ్ స్నాక్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా బొద్దింకలు, ఎలుకలు దర్శనమిచ్చాయి. ఇరుకు కిచెన్ గది అపరిశుభ్రంగా ఉందని అధికారులు తనిఖీల్లో తేలింది. కిచెన్ లో వెంటిలేషన్ లేదని, గోడలన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయని, డస్ట్ బిన్ కూడా సరిగా పెట్టలేదని అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది.
- సికింద్రాబాద్ లోని శ్రీసాయి బాలాజీ ఫుడ్స్ కిచెన్ లో ఆహార వ్యర్థాలు పడి ఉన్నాయి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఆహార పదార్థాలను ఒకేచోట కలిపి పెట్టారని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. బ్లాక్ అయిన షింక్,రిఫ్రిజిరేటరులో అపరిశుభ్రంగా పదార్థాలను నిల్వ ఉంచారని వెల్లడైంది.తమ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆయా హోటళ్లపై కేసులు నమోదు చేశారని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ‘ ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
వంద రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
అక్టోబరు నెలలో హైదరాబాద్‌లోని వందకు పైగా రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. తెలంగాణ ఆహార భద్రతా విభాగం అధికారులు కరీంనగర్ వరకు తమ దాడులు విస్తరించారు.కరీంనగర్‌లోని మైత్రి హోటల్ వంటగదిలో తీవ్రమైన ఆహార భద్రత ఉల్లంఘనలు కనుగొన్నారు.కిచెన్ పైకప్పుల్లో సాలెపురుగులు కనిపించాయి.కిచెన్ స్టోర్ ఏరియా, వంట చేసే ప్రదేశంలో కూడా అపరిశుభ్ర పరిస్థితులు దర్శనమిచ్చాయి.కిచెన్ లో ఓపెన్ డస్ట్‌బిన్‌లతో ఈగలకు నిలయంగా మారింది.
ఆహారంలో సింథటిక్ రంగుల వినియోగం
రెస్టారెంట్ ఆహారంలో సింథటిక్ రంగులను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రెస్టారెంట్ లో ఆర్వో మంచినీటి రికార్డులు, పెస్ట్ కంట్రోల్ రికార్డులను నిర్వహించడం లేదని కనుగొన్నారు. హోటల్‌లో ఫుడ్ హ్యాండ్లర్లు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించారు.ఈ దాడిలో వంటగదిలో లభించిన అపరిశుభ్రమైన ఆహార పదార్థాలను అధికారులు పరీక్ష కోసం ల్యాబ్ కు పంపించారు.మిఠాయివాలా స్వీట్ హౌస్‌లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు.గడువు ముగిసిన పదార్థాలు, ఆహార రంగులు, లేబుల్ లేని బ్రెడ్, పాప్‌కార్న్ వాడారు.
బొద్దింకలు, ఎలుకల మలం కలిసిన ఆహారం తింటే ఫుడ్ పాయిజనింగ్ కు గురవడంతోపాటు అనారోగ్యానికి గురై పలు రోగాల పాలవుతారని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. ఎలుకలు, బొద్దింకలు ఆహారంలోకి హానికరమైన బాక్టీరియా, వైరస్, పారాసైట్స్ ను వ్యాప్తి చేయడం వల్ల విషాహారం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల ప్రజలు టైఫాయిడ్, లెప్రసీ వ్యాధుల బారిన పడతారని వైద్యులు హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో సుఖసాగర్ ఉడుపి వెజ్ హోటల్, హోటల్ ఫిజా, బహదూర్ పురాలోని బేకరీలు,కూకట్ పల్లిలోని శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటళ్లలోని క్యాంటీన్ లో ఎలుకల మలాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. మారేడుమిల్లి రెస్టారెంట్,గచ్చిబౌలిలోని ద మూన్ బ్రీ కంపెనీ, సిల్వర్ బావర్చి రెస్టారెంట్ అండ్ బేకర్స్, కాకతీయ మిలటరీ హోటల్,పటాన్ చెరులోని బాబాయ్ హోటల్,మియాపూర్ లోని అతిథి రెస్టారెంట్, అంగారా రెస్టారెంట్లలోని కిచెన్ రూంలో బొద్దింకలు దర్శనమిచ్చాయి.
అపరిశుభ్రతతో అనారోగ్యం
హోటళ్లు, రెస్టారెంట్లలో అపరిశుభ్ర పరిస్థితుల మధ్య వండిన ఆహారం తినడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని హైదరాబాద్ నగరంలోని ఆశ్రిత హాస్పిటల్ డాక్టర్ ఎ రామమోహన్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హోటళ్లలో ఆహారం తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముందని ఆయన చెప్పారు. దీంతోపాటు విషాహారం వల్ల అనారోగ్యానికి దారితీయ వచ్చని ఆయన పేర్కొన్నారు. కలుషిత, అపరిశుభ్ర కిచెన్ లలో వండిన ఆహారం తింటే వాంతులు, విరోచనాలు, జ్వరం బారిన పడే ప్రమాదముందని ఆయన చెప్పారు.