హైకోర్టులో హైడ్రాపై వరుస కేసులు...హాట్ టాపిక్

‘హైడ్రా’ పై బాధితులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.అక్రమ భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న నేపథ్యంలో కేసులు వేశారు. హైకోర్టులో హైడ్రా హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2024-09-14 04:14 GMT

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ఏర్పాటై రెండు నెలలకే దీనిపై తెలంగాణ హైకోర్టులో వరుస కేసులు దాఖలవుతున్నాయి. వరుస కేసుల దాఖలుతో హైడ్రా సతమతమవుతోంది. హైకోర్టు విచారణలతో హైడ్రా వరుస కౌంటర్లు దాఖలు చేస్తోంది. ఒకవైపు వరుస పిటిషన్లు, మరో వైపు హైడ్రా కౌంటర్లతో హైకోర్టులో హైడ్రా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

- హైడ్రా ఆవిర్భవించాక రెండు నెలల సమయంలో 23 ప్రాంతాల్లోని చెరువుల్లో వెలసిన 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల చెరువు భూములను స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే పలువురు హైకోర్టులో హైడ్రాపై పిటిసన్లు దాఖలు చేశారు.వరుస కూల్చవేతలతో పలువురు బాధతులు హైకోర్టుకు వెళ్లేందుకు మరికొందరు సమాయత్తం అవుతున్నారు.

హైడ్రా జీఓ99 ను సవాలు చేస్తూ పిటిషన్
రాష్ట్ర ప్రభుత్వం జీఓ99 తీసుకువచ్చి హైడ్రా ఏర్పాటు చట్టబద్ధతను సవాలు చేస్తూ నానక్ రాంగూడకు చెందిన డి లక్ష్మీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని సర్వే నంబరు 119/21.199/22 లలోని 19.27 ఎకరాల్లో కూలీల విశ్రాంతి కోసం నిర్మించిన నిర్మాణాలను హైడ్రా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిందని డి లక్ష్మీ తరపున న్యాయవాది పేర్కొన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నా హైడ్రా పట్టించుకోలేదని, జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు ఎలా బదలాయిస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. ఏ చట్టం ప్రకారం హైడ్రాకు అపరిమిత అధికారాలు ఇచ్చారని పిటిషనర్ తరపున న్యాయవాది పేర్కొన్నారు.

నోటీసులు లేకుండా ఎలా కూలుస్తారు?
హైడ్రా చట్టబద్ధతపై డి లక్ష్మి సమర్పించిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ జరిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరును జస్టిస్ కె లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చాక నిర్మించుకున్న భవనాలను నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని జడ్జి హైడ్రాను నిలదీశారు.కోర్టులో చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని జడ్జీ వ్యాఖ్యానించారు. జీఓ 99 చట్ట పరిధిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కూల్చివేతలపై మాజీ ఎమ్మెల్యే భార్య పిటిషన్
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ గ్రామంలోని 9 ఎకరాల వ్యవసాయ భూమిలో నిర్మించిన షెడ్ , కాంపౌండ్ ను హైడ్రా కూల్చివేయడాన్ని వైకాపా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమీన్ పూర్ ఎఫ్టీఎల్ పరిధిలో తమ భూమి లేదని నీటిపారుదల శాఖ అధికారులు నివేదిక ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ టి వినోద్ కుమార్ కాంపైండు వాల్ నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించారు.1970 నాటి అమీన్ పూర్ చెరువు మ్యాప్ ను సమర్పించాలని, ఈ పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయాలని మున్సిపల్, ఇరిగేషన్ శాఖలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై...
సినీనటుడు అక్కినేని నాగార్జున తన ఎన్ కన్వెన్షన్ కన్వెన్షన్ హాలు కూల్చివేతను సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తుమ్మిడి చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి నిర్మించిన కన్వెన్షన్ హాలును కూల్చివేయవద్దని హైకోర్టు జడ్జి జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ జరిపారు. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేసరికి కూల్చివేతలు ముగిశాయి.

జన్వాడ ఫాంహౌస్ కూల్చివేయవద్దంటూ...
జన్వాడలోని ఫాం హౌస్ ను కూల్చివేయవద్దని దాని యజమాని ప్రదీప్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న ఈ ఫాం హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ విన్నపాన్ని హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ హైడ్రాకు ఉన్న పరిమితులు, అధికారాలను తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News