కవ్వాలకు పులులు పంపించండి,మహారాష్ట్రాకు ఆదిలాబాద్ అధికారుల అభ్యర్థన

మాకు పులులు, పులి పిల్లలివ్వండి ప్లీజ్ అంటున్నారు కవ్వాల టైగర్ రిజర్వు ఫారెస్ట్ అధికారులు.మహారాష్ట్ర నుంచి పులులను కవ్వాలకు పంపించాలని తెలంగాణ కోరుతుంది.

Update: 2024-10-15 06:20 GMT

గల గల పారుతున్న గోదావరి, కడెం నదుల పరివాహక ప్రాంతం...ఎతైన కొండలు, గుట్టల నడుమ...పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాల మధ్య కవ్వాల పులుల అభయారణ్యం విస్తరించి ఉంది. మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఆదిలాబాద్,నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని 2015.44 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియాలో కవ్వాల పులుల అభయారణ్యం నెలకొంది.

- భారత ప్రభుత్వం 2012వ సంవత్సరంలో కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని టైగర్ రిజర్వ్‌గా ప్రకటించింది.కవ్వాలను టైగర్ రిజర్వుగా కేంద్రం ప్రకటించి 12 సంవత్సరాలు గడచినా ఇక్కడ ఒక్కటంటే ఒక్క పులి జాడ లేక పోవడంతో అటవీశాఖ అధికారులు ఆలోచనలో పడ్డారు.
- ఈ సంవత్సరం ప్రారంభంలో కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని దారేగావ్ గ్రామంలో పులులు చనిపోయిన ఘటనలు వెలుగుచూశాయి. ఆ తర్వాత రెండు నెలల క్రితం పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వు నుంచి ఓ పెద్దపులి కవ్వాల అభయారణ్యంలో సంచరించినా, ఆ తర్వాత దాని జాడ లేకుండా పోయింది.
- కవ్వాల పులుల అభయారణ్యంలో పులులు ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా దట్టమైన అడవిలో ఉన్న మైసంపేట, రాంపూర్ గ్రామాలను సైతం పులుల పరిరక్షణ కోసం మైదాన ప్రాంతానికి తరలించి గిరిజనులకు అటవీశాఖ అధికారులు పునరావాసం కల్పించారు.పులుల కోసం రెండు గ్రామాలను తరలించినా, అసలు అభయారణ్యంలో పులుల జాడే లేకుండా పోయింది.

కవ్వాల అటవీశాఖాధికారుల అభ్యర్థన
పులుల పరిరక్షణ,పునరుత్పత్తి కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాలను టైగర్ రిజర్వుగా ప్రభుత్వం ప్రకటించి పన్నెండేళ్లు గడిచినా కవ్వాలలో ఒక్క పులి జాడ కూడా లేదు.కవ్వాల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు మహారాష్ట్రకు చెందిన పులులపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో పొరుగున ఉన్న మహారాష్ట్ర అడవుల నుంచి ఓ మగ పులి, కొన్ని ఆడ పులులు, పులి పిల్లలను కవ్వాలకు పంపించాలని కవ్వాల అటవీ శాఖ అధికారులు మహారాష్ట్ర అటవీశాఖను అభ్యర్థించారు.

పులులను పెంచడానికి...
తెలంగాణ అటవీ శాఖ అధికారులు కవాల్ టైగర్ రిజర్వ్‌లో పులుల జనాభాను పెంచడంలో సహాయపడటానికి ఒక మగ పులి,ఆడ పులులులేదా కొన్ని పులి పిల్లలను పంపించాలని కవ్వాల అటవీశాఖ అధికారులు మహారాష్ట్ర అటవీ శాఖకు విజ్ఞప్తి చేశారు. కవ్వాల అభయారణ్యంలో చీటల్, సాంబార్, బార్కింగ్ డీర్, నీల్‌గాయ్, స్లాత్ బేర్, ఇండియన్ బైసన్, చిరుతలు ఉన్నాయి. పర్యాటకులు ఈ వన్యప్రాణుల అభయారణ్యంలో మొసళ్లు, కొండచిలువ, మానిటర్ లిజార్డ్, స్టార్ టార్టాయిస్, కోబ్రా వంటి సరీసృపాలను కూడా చూశారు.

కెమెరా ట్రాప్ డేటాను సేకరించేందుకు...
కవ్వాల పులుల అభయారణ్యంలో జంతువుల కదలికలను గుర్తించేందుకు కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశారు. సాధారణంగా వన్యప్రాణుల సంచారాన్ని రికార్డ్ చేయడానికి నీటి వనరుల సమీపంలోని పచ్చికభూములు,అటవీ మార్గాలు,జంతువుల విశ్రాంతి స్థలాలు వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో కెమెరాలను ఏర్పాటు చేశారు.లొకేషన్ వివరాలకు సంబంధించి ప్రతి కెమెరాకు ప్రత్యేకమైన కోడ్‌ని కేటాయించారు.

అమ్రాబాద్ అభయారణ్యంలో పెరిగిన పులుల సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో 33 పులులున్నాయని అధికారులు లెక్కలు కట్టారు. 2022లో సేకరించిన పులుల గణన ప్రకారం అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య 21 ఉండగా, ఈ ఏడాది 33కి పెరిగాయి. ఏటీఆర్‌లో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతుండగా, కవాల్‌లో పరిస్థితి దారుణంగా మారింది.కవ్వాలలో శాశ్వత నివాసమున్న పులులు లేవు. దీంతో పొరుగున ఉన్న తాడోబా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పులులు కవ్వాలలోకి వలస వస్తున్నాయి.

తాడోబా టు సిర్పూర్ కాగజ్ నగర్ బెల్ట్ అటవీ మార్గం...
మహారాష్ట్రలోని తాడోబా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కవ్వాలలోకి పులులు వలస వచ్చేందుకు సిర్పూర్-కాగజ్‌నగర్ బెల్ట్ అటవీ మార్గం ఒకటి. పొరుగున ఉన్న తాడోబా టైగర్ రిజర్వు నుంచి పులులు, పులి పిల్లలను కవ్వాలలోకి తెప్పించేందుకు తెలంగాణ అటవీ శాఖ మహారాష్ట్రలోని అటవీశాఖ అధికారులను కోరుతోంది.



నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆమోదిస్తేనే...

మహారాష్ట్రలోని తాడోబా, తిప్పేశ్వర్‌ అటవీ ప్రాంతాల్లో పులులు ఉన్నాయి.పులులు, పులి పిల్లల పునరావాసం కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తాము ప్రతిపాదించిన ప్రణాళికను ఆమోదించాల్సి ఉందని కవ్వాలకు చెందిన ఓ అటవీ అధికారి చెప్పారు. పులుల పునరావాసంతోపాటు,వాటిని పరిరక్షణ కోసం కవ్వాల అధికారులు చర్యలు తీసుకోనున్నారు.పులుల పరిరక్షణలో మహారాష్ట్రలోని అటవీ శాఖ అధికారులతో తెలంగాణలోని అటవీ సిబ్బందికి కొన్ని అంశాల్లో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.

తాడోబా అంధేరి టైగర్ రిజర్వు విస్తరణ
పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని తాడోబా అంధేరి టైగర్ రిజర్వును అదనంగా 78.79 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. తాడోబా టైగర్ రిజర్వులోని పులులు తరచూ జనసంచారం ఉన్న చంద్రాపూర్ జిల్లా గ్రామాల్లోకి వస్తున్న నేపథ్యంలో టైగర్ రిజర్వును మహారాష్ట్ర సర్కారు విస్తరించింది. తాడోబా పులుల అభయారణ్యం విస్తీర్ణం 704 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. తాడోబా పులుల అభయారణ్యం విస్తీర్ణం పెపుతో పులుల సంరక్షణకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని మహారాష్ట్ర వన్యప్రాణుల విభాగం చీఫ్ వార్డెన్ వివేక్ ఖండేకర్ చెప్పారు.పులుల కోసం దట్టమైన అడవిలో ఉన్న కర్వా గ్రామాన్ని తరలించేందుకు పునరావాసం కల్పించాలని నిర్ణయించారు.


Tags:    

Similar News