కేటీఆర్, హరీష్‌కు సీతక్క వాత..

మూసీ ప్రక్షాళన అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. సవాళ్లు ప్రతిసవాళ్లు, ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలతో తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి.

Update: 2024-10-18 10:39 GMT

మూసీ ప్రక్షాళన అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. సవాళ్లు ప్రతిసవాళ్లు, ఆరోపణలు ప్రత్యారోపణలు, విమర్శలతో తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. మూసీ ప్రక్షాళన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని శుక్రవారం హరీష్ రావు ఆరోపించారు. ఇవే ఆరోపణలు కేటీఆర్ నోటి నుంచి గతంలోనే వచ్చాయి. అంతేకాకుండా ఎక్కడనా చర్చలకు సిద్ధమని, కారు తానే డ్రైవ్ చేస్తూ తీసుకువస్తానని, మరి చర్చకు సీఎం రెడీనా అంటూ రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్ కూడా చేశారు. ఈరోజు మూసీ ప్రక్షాళనపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో మంత్రి సీతక్క.. హరీష్ రావు, కేటీఆర్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. గతాన్ని మరిచి వాళ్లు మాట్లాడుతున్నారని, మాట్లాడే ముందు వాళ్లు చేసిన పనులను వాళ్లు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. ‘రియల్ ఎస్టేట్ పేరుతో హైదరాబాద్ చుట్టూ ప్లాట్లు అమ్ముకున్నది కేటీఆర్ కాదా? అప్పుడు ప్లాట్లు అమ్ముకుని మంచి అనుభవం పొందడం వల్లే ఇప్పుడు మూసీ ప్రక్షాళనలో కూడా కేటీఆర్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపారం కనిపిస్తోంది’’ అని పంచులు పేల్చారామే.

రేవంత్ ఏం చేసిన పేదల కోసమే

‘‘తెలంగాణ పునరుజ్జీవనం అని మాట్లాడిన వ్యక్తి హరీష్ రావు. మరి అదెక్కడ జరిగిందో చెప్పాలి. పదేళ్ల పదవీ కాలంలో హరీష్ రావు ఏ చెరువుకు పునర్జీవనం పోశారో చూపాలి. పేదలకు న్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ నేతల కడుపులు మండుతున్నాయి. రేవంత్ రెడ్డి ఏం చేసినా అది పేదల క్షేమం కోసమే. దాన్ని జీర్ణించుకోలేకే ప్రతి రోజూ మీడియా ముందుకు వచ్చి బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. వాళ్లు ఇప్పటికైనా ఇలా నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకుని.. మరింత సుభిక్ష పాలన అందించడానికి సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది’’ అని సూచించారు. అంతేకాకుండా ఈరోజు మంత్రి సీతక్క.. మూసీ నిర్వాసితులకు ఆమె చెక్కులు అందించారు.

నిర్వాసితులకు రుణాలు కూడా..

మూసీ నిర్వాసితులను తరలించడానికి కాంగ్రస్ సర్కార్ కసరత్తులు చేస్తోంది. ఇందులో బాగంగా మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తోంది. దాంతో పాటుగా వారి జీవనోపాధిని మెరుగుపరచడం కోసం రుణాలు కూడా అందించడానికి చర్యలు చేపడుతోంది. వీటికి సంబంధించిన రుణ చెక్కులను మంత్రి సీతక్క ఈరోజు నిర్వాసితులకు అందించారు.17 స్వయం సహాయక మహిళా సంఘాకు చెందిన 172 మంది మహిళలకు రూ.3.44 కోట్లు విలువైన చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగానే ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు తమ ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నమ్మి ద్వేషం పెంచుకోవద్దని అన్నారు.

అలాంటి చోటే జీవించాలి..

‘‘ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారడం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ పరిస్థితులను అర్థం చేసుకువాలని ప్రజలను కోరుతున్నా. మూసీ నది ఉధృతి పెరిగితే అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎవరైనా మంచి వాతావరణంలో జీవించాలి. మంచిగా గాలి, వెలుతురు, నీరు అందేలా జీవనం సాగించాలి. మనం కాకపోయిన మన భవిష్యత్ తరాలైనా స్వచ్ఛమైనా గాలి, నీటితో జీవించే అవకాశం కల్పించాలి. ఇప్పటికే మూసీ కంపులో ఒకతరం జీవనం సాగించేసింది. ఇటువంటి పరిస్థితులు మరో తరానికి సంభవించకుండా ఉండటానికే ఈ చర్యలు తీసుకుంటున్నాం. అందుకోసమే ఈ రుణాలు అందిస్తున్నాం. మహిళల గ్రూపుల్లో ఒక్కో మహిళకు రూ.2 లక్షల రుణం ఇస్తున్నాం. అందులో రూ.1.4 లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుంది. మిగిలిన రూ.60 వేలను మాత్రమే లబ్ధిదారులకు కట్టాల్సి ఉంటుంది.

Tags:    

Similar News