‘మహిళల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ కించపరిచింది’.. హరీశ్ రావుకు సీతక్క కౌంటర్..

బతుకమ్మ చీరలపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను మాతాశిశు సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు.

Update: 2024-10-17 07:39 GMT

బతుకమ్మ చీరలపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను మాతాశిశు సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. హరీష్ రావు సరిగా మాట్లాడాలంటూ కౌంటర్ ఇచ్చారు. బతుకమ్మ పండగను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీర పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. కానీ దానిని ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ సర్కార్ మాత్రం మూలబెట్టేసిందని హరీష్ రావు విమర్శించారు. ఆయన వ్యాఖ్యలను ఎట్టిపరిస్థితుల్లో తాము అంగీకరించమని, అసలు బతుకమ్మ చీరల గురించి, తెలంగాణ మహిళల ఆత్మగౌరవం గురించి హరీష్ రావు మాట్లాడటం సరైన పద్దతి కాదంటూ మండిపడ్డారు.

సీతక్క ఏమన్నారంటే..

‘‘ప్ర‌జా ప్ర‌భుత్వంలో బతుకమ్మ చీరను బంద్ పెట్టారన్న హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం. నాసి ర‌కం చీర‌లిచ్చి మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వాన్నిబీఆర్ఎస్ కించ‌ప‌రిచింది. బతుక‌మ్మ చీర‌ల‌కు మించిన ఆర్దిక ప్ర‌యోజ‌నాల‌ను మ‌హిళ‌ల‌కు క‌ల్పిస్తున్నాం. బ‌తుక‌మ్మ చీర‌ల‌కు గ‌త ప్ర‌భుత్వం ఏడాదికి చేసిన ఖ‌ర్చు రూ.300 కోట్లు మాత్ర‌మే. మ‌హిళ‌ల‌కు ఆర్దిక స్వేచ్చ క‌ల్పించేందుకు ఆర్టీసీలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని అమ‌లు ప‌రుస్తున్నాం. మ‌హిళ‌కు ప్ర‌యాణ బారం లేకుండా ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని కల్పిస్తున్నాం. పైసా ఖ‌ర్చు లేకుండా మ‌హిళ‌లు ఉచిత ప్ర‌యాణం చేస్తున్నారు’’ అని తెలిపారు.

అక్కచెల్లెమ్మల కొసం కోట్ల ఖర్చు

‘‘నిన్నటి దాకా 98.50 కోట్ల ఉచిత ప్ర‌యాణాల‌ను అక్క‌చెల్లెమ్మ‌లు వినియోగించుకున్నారు. ఉచిత ప్ర‌యాణం విలువ అక్ష‌రాల రూ. 3,325 కోట్లు. అంటే స‌గ‌టున నెల‌కు రూ. 332 కోట్లు ఆడ‌బిడ్డ‌ల‌కు ఆదా అవుతోంది. గ‌త ప్ర‌భుత్వం బ‌తుక‌మ్మ చీర‌ల కోసం వెచ్చించిన‌ బ‌డ్జెట్ కు ప‌దిరెట్లు అధికంగా ఉచిత బ‌స్సు ప్ర‌యాణం కోసం మా ప్ర‌భుత్వం వెచ్చిస్తోంది. ఒక్క ఏడాది కోసం బ‌తుక‌మ్మ చీర‌ల ఖ‌ర్చు రూ. 300 కోట్లు. అదే ఒక్క నెల ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఖ‌ర్చు రూ.332 కోట్లు. మ‌హిళ‌ల‌ వంటింటి భారం త‌గ్గించేందుకు రూ.500 కే గ్యాస్ సిలిండ‌ర్ తెచ్చింది కాంగ్రెస్. అదే గ్యాస్ సిలెండర్ బీఆర్ఎస్ హయాంలో రూ.1200గా ఉండేది’’ అని అప్పటికి ఇప్పటికి నిత్యావసరాల ధరల్లో ఉన్న వ్యత్యాసాలను ఆరోపించారు.

‘‘రూ.500 కే గ్యాస్ సిలిండ‌ర్ ఇచ్చేందుకు ఇప్ప‌టికే రూ. 300 కోట్ల‌కు పైగా ప్ర‌జా ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది. 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ప‌థ‌కం కింద వేయి కోట్లు వెచ్చించాం. మ‌హిళా సంఘాల ఆర్దిక స్వావ‌లంబ‌న‌ కోసం బ్యాంకుల‌కు రూ.400 కోట్ల వ‌డ్డీని ప్ర‌భుత్వ‌మే చెల్లించింది. మ‌రో వేయి కోట్లు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నాం. మ‌హిళ‌ల గౌర‌వాన్ని నిలబెడుతూ వారిని ఆర్దికంగా బ‌లోపేతం చేసేందుకు చేయుత నిస్తున్నాం. బీఆర్ఎస్ పాల‌న వైఫ‌ల్యాల‌ను స‌రిదిద్దుతూ ఎన్నిక‌ల హ‌మీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు పరుస్తున్నాం’’ అని వివరించారామే.

Tags:    

Similar News