సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరి మధ్యా చీరల పంచాయితీ నెలకొంది.

By :  Vanaja
Update: 2024-05-05 15:09 GMT

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం జోరందుకుంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరి మధ్యా చీరల పంచాయితీ నెలకొంది. సోషల్ మీడియాలోనూ పరస్పర కౌంటర్లు ఇచ్చుకుంటూ హీటేక్కిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌ లో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కేటీఆర్‌‌పై సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "కేటీఆర్ నీకు సినిమా వాళ్లు బాగా తెలుసు కదా.. నువ్వు చీర కట్టుకుని ఆడపిల్లలా మంచిగా తయారై.. ఆర్టీసీ బస్సు ఎక్కు.. కండక్టర్ నిన్ను టికెట్ డబ్బులు అడిగితే, ఆరు గ్యారంటీలు అమలు కాలేదని అప్పుడు ఒప్పుకుంటాం.. లేకుంటే తాము ఇచ్చిన హామీలు అమలు అయినట్లే.." అంటూ తనదైన శైలిలో కేటీఆర్‌ కి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. నిర్మల్ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 తమ అకౌంట్లో వేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. కేటీఆర్ దీనిపై ట్విట్టర్‌ వేదికగా రేవంత్ రెడ్డిని నిలదీశారు.

"రేవంత్ రెడ్డి, నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా? తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 యేండ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెసుని బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం. కేసిఆర్ కిట్ ఆగింది. న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కల్యాణ లక్ష్మి నిలిచింది, తులం బంగారం అడ్రస్ లేదు. ఫ్రీ బస్సు అని బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి. అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్ కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని, చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది" అంటూ ట్విట్టర్ లో కేటీఆర్ రేవంత్ కి కౌంటర్ ఇచ్చారు. 

Tags:    

Similar News