Sankranti | నిషేధ ఉత్తర్వులు బేఖాతర్, కోడి పందాలు, చైనీస్ మాంజా జోరు
సంక్రాంతి సందర్భంగా నిషేధ ఉత్తర్వులు బేఖాతర్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో నిషేధ ఉత్తర్వులున్నా ఏపీలో కోడి పందాలు,తెలంగాణలో చైనా మాంజాతో పతంగులను ఎగురవేశారు.;
By : Shaik Saleem
Update: 2025-01-15 02:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సంక్రాంతి పండుగ సంస్కృతి, సంప్రదాయాల పేరిట ప్రభుత్వం, కోర్టులు జారీ చేసిన నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో కోడిపందాలు, తెలంగాణలో చైనా మాంజాతో గాలిపటాలను యథేచ్ఛగా ఎగురవేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించినా చర్యలు తీసుకోవడం లేదు.
నిషేధ ఉత్తర్వులు ఉన్నా...
1974 నాటి ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం వినోదం లేదా జూదం ప్రయోజనాల కోసం పోరాటాల కోసం పక్షులు లేదా జంతువులను ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది.దీంతోపాటు బెట్టింగులు కాయడం కూడా నేరమే. అంటే కోడిపందాలు నిర్వహించడం, బెట్టింగులు రెండూ నిషేధమే.
బహిరంగంగానే కోడి పందాలు, బెట్టింగులు
కానీ ఏపీలో పలు జిల్లాల్లో బహిరంగంగానే కోడిపుంజులకు కత్తి కట్టి, లక్షలాది రూపాయలను బెట్టింగు కాస్తూ కోడి పందాలు జోరుగా నిర్వహించారు. కానీ చట్టం ప్రకారం దీన్ని నివారించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోట్లాది రూపాయలను బెట్టింగ్ రూపంలో నగదు లావాదేవీలు జరిగినట్లు సాక్షాత్తూ వీడియోల్లో వెలుగుచూసినా , దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చట్టాలు చేసే ప్రజాప్రతినిధుల సాక్షిగా కోడి పందాలు కోలాహలంగా సాగాయి.
చైనా మాంజాపై నిషేధం ఉన్నా...
సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడం సంప్రదాయంగా వస్తూ ఉంది. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ గాలిపటాలను ఎగురవేస్తున్నారు. పతంగులు ఎగురవేయవచ్చు కానీ పక్షులకు హాని తలపెట్టే చైనా మాంజాను పతంగులను ఎగురవేయడానికి వాడరాదు. చైనీస్ మాంజాను నిషేధిస్తూ 2021వ సంవత్సరంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కానీ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చైనా మాంజాను గాలిపటాలు ఎగురవేసేందుకు యథేచ్ఛగా వాడుతున్నారు. నిషేధ ఉత్తర్వులను సంక్రాంతి సంప్రదాయం పేరిట ఉల్లంఘిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా కోడి పందాలు
1960 జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 2016 హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి సంక్రాంతి సందర్భంగా కోడి పందాలను తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో కోడి పందాలు జోరుగా నిర్వహిస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లో కోడి పందాలు నిర్వహించిన వారికి మూడు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కోడి పందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు పోలీసు సూపరింటెండెంట్లు, పోలీసు కమిషనర్లు, కలెక్టర్లను ఆదేశించినా అమలు కాలేదు.
హైదరాబాద్‌లో చైనీస్ మాంజా విక్రయాలు
చైనీస్ మాంజాతో గాలిపటాలను ఎగురవేయడం వల్ల పక్షులు గాయాల పాలవుతున్నాయి.పావురాలు, గుడ్లగూబ పలు రకాల పక్షులు గాయపడుతున్నాయి. పక్షులే కాకుండా ప్రజలు కూడా చైనా మాంజాతో గాయపడుతున్నారు. సంక్రాంతి సంస్కృతి, ఫన్ పేరిట పతంగులను చైనా మాంజాతోనే ఎగురవేశారు. గత ఏడాది అక్టోబరు 1వతేదీ నుంచి జనవరి 13వతేదీ వరకు ఒక్క హైదరాబాద్ నగరంలోనే రూ.88 లక్షల 7,334 చైనీస్ మాంజాల బాబిన్సు ను పోలీసులు సీజ్ చేశారు. చైనా మాంజా విక్రయిస్తున్న 148 మందిపై 107 కేసులు నమోదు చేశారంటే చైనీస్ మాంజా విక్రయాల జోరు ఏ విధంగా సాగుతుందో విదితమవుతుంది.