చేతులు కాలాక.. ఆకులు పట్టుకుని.. ఏం లాభం?
రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు ఎవరి తప్పిదం? దేశంలో పది బ్లూ ఫ్లాగ్ బీచ్‌ల్లో ఒక్క విశాఖదే రద్దవడం అవమానం.;
సరిగ్గా ఐదేళ్ల క్రితం .. 2020లో విశాఖలోని రుషికొండ బీచ్‌కు ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందింది. అప్పట్లో ఈ ఘనత ఊరూ వాడా పాకింది. దీనికి కారణం తామేనంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. అయితే అంతకు ముందు తాము అధికారంలో ఉండగా చేపట్టిన చర్యల వల్లే అది సాధ్యమైందని టీడీపీ కౌంటర్ చేసింది. ఇలా ఎవరి గొప్పతనం వల్లనైతే గాని ఈ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సొంతమైంది. దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను సొంతం చేసుకున్న పది బీచ్ లలో ఒకటిగా ఇది నిలిచింది.
ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణమైంది. అలాంటి ప్రెస్టేజియస్ సర్టిఫికేషన్ పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు రద్దయింది. దేశంలోని మిగిలిన తొమ్మిది బీచ్‌ల బ్లూ ఫ్లాగ్‌లు పదిలంగానే ఉండగా ఒక్క వైజాగ్ రుషికొండ బీచ్ సర్టిఫికేషన్ మాత్రమే క్యాన్సిల్ అయింది. ప్రభుత్వం పరువు పోయినట్టయింది. దీంతో ఆలస్యంగా మేలుకున్న కూటమి ప్రభుత్వం డ్యామేజీ కంట్రోల్ చర్యలు చేపట్టింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇద్దరు అధికారులను బాధ్యులను చేసి చేతులు దులుపుకుంది. అయినా జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది. ఇప్పుడు ఆ డ్యామేజీకి కారణం తమది కాదంటే తమది కాదని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి దాపురించింది.
రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్‌ల రెపరెపలు
విశాఖ సాగరతీరానికి మణిహారంగా చెప్పుకునే రుషికొండ బీచ్ అందం ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. ప్రక్రుతి ప్రసాదించి సహజ సౌందర్యం ఈ బీచ్ సొంతం. ఒకపక్క ఎగసి పడుతూ కనిపించే అలలు, ఆ పక్కనే పచ్చని కొండలు, పచ్చదనం పరిచే చెట్లు, ఎత్తు పల్లాలు అంతగా లేని ఇసుక తిన్నెలు.. ఉధ్రుతి లేని కెరటాలు, తక్కువ లోతుగా ఉండే సముద్రం.. ఇలా ఒకటేమిటి? అన్నీ అక్కడ ప్రత్యేకమే. అందుకే నగరంలోని మిగతా బీచ్‌లకంటే రుషికొండ బీచ్ సురక్షితంగా భావించి పర్యాటకులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతుంటారు. ఈ బీచ్‌లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని 2020లో డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థ ఈ రుషికొండ బీచ్ (600 మీటర్ల మేర) కు ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఈ బీచ్‌కు మరింత గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇలా నాలుగేళ్ల పాటు ఆ సర్టిఫికెట్ మనుగడలో ఉంది. ఆ తర్వాత పాలకుల నిర్లక్ష్యం, పర్యాటక శాఖ అధికారుల అలసత్వం, ఆధిపత్య పోరు, బాధ్యతా రాహిత్యం ఏకమై ఆ ప్రెస్టేజియస్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును మింగేసింది.
రుషికొండ బీచ్‌లో ఏం జరిగింది?
రుషికొండ బీచ్‌కు వచ్చిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు కావడానికి దారి తీసిన కారణాలను పరిశీలిస్తే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కొద్ది నెలలుగా ఈ బీచ్‌లో వీధి కుక్కల స్వైరవిహారం, సీసీ కెమెరాలు పనిచేయక పోవడం, చెత్త, చెదారాలు పేరుకుపోవడం, మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్థంగా మారడం, నడక దారులు ధ్వంసం కావడం, ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం, దుర్గంధం, ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం వంటివి నిత్యక్రుత్యమయ్యాయి. రుషికొండ బీచ్‌లో నెలకొన్న ఈ దుర్భర పరిస్థితులను చూసిన పర్యాటకులు బ్లూ ఫ్లాగ్ గుర్తింపునిచ్చిన డెన్మార్క్ ఎఫ్ఈఈ సంస్థకు ఫోటోలు, వీడియోలు తీసి సజీవంగా పంపారు. వాటిపై స్పందించిన ఎఫ్ఈఈ జనవరిలో బ్లూ ఫ్లాగ్ ఇండియా నేషనల్ ఆపరేటర్ ద్వారా బ్లూ ఫ్లాగ్ గుర్తింపునకు అనుగుణంగా బీచ్‌లో చర్యలు చేపట్టాలని సూచించింది.
అందాల రుషికొండ బీచ్
అనంతరం ఫిబ్రవరి 13న ఈ రుషికొండ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. దీంతో ఉలిక్కిపడిన జిల్లా యంత్రాంగం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్.. జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, పోలీస్, పర్యాటక, అటవీ శాఖాధికారులతో సమావేశం నిర్వహించి రుషికొండ బీచ్‌కు పూర్వవైభవాన్ని తీసుకురావాలని ఆదేశించారు. అప్పట్నుంచి ఈ అధికారులు ఈ బీచ్‌లో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితులను సరి చేసే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఇప్పటివరకు 70 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలినవి త్వరలో పూర్తి చేయడానికి తంటాలు పడుతున్నారు. మరోవైపు ఈనెల 4న జరిగే సేఫ్టీ ఆడిట్ తర్వాత రద్దయిన బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరిస్తారన్న ఆశతో అధికారులున్నారు.
ఆలస్యంగా వెలుగులోకి..
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్‌ల్లో నీలి రంగు జెండాను ఎగుర వేస్తారు. ఈ జెండా ఉన్న బీచ్‌లు పర్యావరణ హితంగాను, పరిశుభ్రంగాను, ఆహ్లాదకరంగాను, మౌలిక సదుపాయాలు కలిగి ఉంటాయని అర్థం. అలా విశాఖలోని ఈ రుషికొండ బీచ్‌లోనూ 2020లో బ్లూ ఫ్లాగ్ జెండాను ఏర్పాటు చేశారు. దానికి ఒకవైపు భారత జాతీయ జెండా, మరో వైపు కాషాయ వర్ణం కలిగిన మరో జెండాను అమర్చారు. అప్పట్నుంచి బ్లూ ఫ్లాగ్ గురించి ఇటు వైజాగ్ వాసులు గాని, అటు రాష్ట్ర ప్రభుత్వం గాని ఎంతో గొప్పగాను, సగర్వంగానూ చెప్పుకుంటున్నారు. ఈ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దయిందన్న సంగతి రెండు మూడు రోజుల క్రితం వరకు తెలియలేదు. అధికారులకు తెలిసినా పరువు పోతుందని గోప్యంగా ఉంచారు. ఈ విషయం మీడియా ద్వారా బయట పడడంతో అంతా అవాక్కయ్యారు. నిబంధనల ప్రకారం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దయితే ఆ నీలి జెండాను ఎగురవేయడానికి వీల్లేదు. దీని గుర్తింపు రద్దయిన వెంటనే ఆ జెండాను దించేయాల్సి ఉంటుంది.
గుర్తింపు రద్దుతో జెండాలు తొలగించాక
విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ రద్దు చేసిన నేపథ్యంలో అధికారులు హుటాహుటీన ఆ జెండాతో పాటు అటూ ఇటూ ఉండే జెండాలను కూడా తొలగించేశారు. దీంతో ఇప్పుడక్కడ జెండాల్లేకుండా బోడి పైపులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు తాత్కాలికమేనని, గుర్తింపును మళ్లీ పునరుద్ధరిస్తారని అధికారులు చెబుతున్నారు. ఇంతలో బ్లూ ఫ్లాగ్ రద్దు పాపం తమది కాదంటే తమది కాదని కూటమి, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటున్నారు. వైసీపీ పాలనలో తప్పిదాల వల్లే ఈ పరిస్థతి దాపురించిందని, కాంట్రాక్టరు తమ సిబ్బందికి జీతాలివ్వకపోవడంతో రుషికొండ బీచ్ అధ్వానంగా తయారైందని కూటమి నేతలు బురద జల్లుతున్నారు. అయితే 2020 నుంచి 2024 వరకు నాలుగేళ్ల పాలనలో రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్‌కు ఢోకా లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో పట్టించుకోవడం మానేయడంతోనే ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దయిందని వైసీపీ నాయకులు తిప్పి కొడుతున్నారు. ఏది ఏమైనా పాలకుల నిర్లక్ష్యంతో .. అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రతిష్టలుండే బ్లూ ఫ్లాగ్ గుర్తింపును రుషికొండ బీచ్ కోల్పోవడాన్ని వైజాగ్ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు.
అధికారుల బదిలీలతో సరా?
రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు నేపథ్యంలో ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇద్దరు పర్యాటక శాఖ అధికారులను బదిలీ చేసి చేతులు దులుపుకుంది. జిల్లా పర్యాటక అధికారి (డీటీవో) జ్ఞానవేణి, పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ (ఇన్‌చార్జి) రమణలను బాధ్యతలను తప్పించింది. వారి స్థానంలో డీటీవోగా విజయనగరం జిల్లా పర్యాటక అధికారి గరికిన దాసును, ఆర్డీగా పర్యాటక శాఖ డివిజనల్ మేనేజర్ జగదీష్‌ను నియమించింది.
ప్రొఫెసర్ కేఎస్ చలం
రుషికొండ బీచ్‌నూ రక్షించుకోలేక పోతే ఎలా?
*విశాఖ అందాల్లో రుషికొండ బీచ్‌ది ఓ ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాల్లో మరెక్కడా ఇలాంటి బీచ్ లేదు. ఈ బీచ్ అందాలు, పరిశుభ్రత, పర్యావరణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్లూ ఫ్లాగ్ గుర్తింపునిచ్చారు. పాలకులు ఈ బీచ్‌ను మరింత సుందరీకరణ చేయలేకపోతే పోయారు.. కనీసం ఉన్న ప్రమాణాలనైనా నిలబెట్టలేరా? అందమైన ఈ బీచ్‌ను దుర్భరం చేస్తే పర్యాటకులెలా వస్తారు? ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోతే విశాఖలో పెట్టుబడులకు ఎవరు ముందుకొస్తారు? నిర్లిప్లతను మాని తక్షణమే రుషికొండ బీచ్‌కు పూర్వ వైభవం తెచ్చి తిరిగి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తీసుకురావాలి* అని ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ కేఎస్ చలం * ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్* ప్రతినిధితో చెప్పారు.
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి?
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది "ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ ఇన్ డెన్మార్క్" ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎకో-లేబుల్. దీనిని నిర్దేశించిన అవసరాలను తీర్చే బీచ్‌లు, మెరీనాలు, స్థిరమైన బోట్ టూరిజం ఆపరేటర్లకు ప్రదానం చేస్తారు. ఏదైనా బీచ్‌ల్లో నీలి జెండాను చూసినప్పుడు, బీచ్ లేదా మెరీనా శుభ్రంగా ఉందని, గొప్ప నీటి నాణ్యతను, అధిక భద్రతా ప్రమాణాలను కలిగి ఉందని , తీరప్రాంతాల, పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి కృషి చేస్తోందని అర్థం.
దేశంలో బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు ఎక్కడున్నాయ్?
గోల్డెన్ బీచ్ - ఒడిశా
శివరాజ్‌పూర్ బీచ్ - గుజరాత్
కప్పడ్ బీచ్ - కేరళ
ఘోఘ్లా బీచ్ - డయ్యు
రాధానగర్ బీచ్ - అండమాన్ మరియు నికోబార్
కాసర్కోడ్ బీచ్ - కర్ణాటక
పడుబిద్రి బీచ్ - కర్ణాటక
రుషికొండ బీచ్ - ఆంధ్రప్రదేశ్
కోవలం బీచ్ - తమిళనాడు
ఈడెన్ బీచ్ - పుదుచ్చేరి