వరంగల్ విమానాశ్రయానికి టేకాఫ్, భూసేకరణకు రూ.205 కోట్లు

వరంగల్ మామునూర్ విమానాశ్రయం నిర్మాణంలో ముందడుగు పడింది.ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం రూ.205 కోట్ల రూపాయలను సర్కారు విడుదల చేసింది.

Update: 2024-11-17 14:04 GMT

ఓరుగల్లు వాసుల చిరకాల వాంఛ త్వరలో తీరనుంది. వరంగల్ జిల్లా మామునూరులో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం రూ.205 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

- ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపిఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ లేఖ రాసింది.
- వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల దూరం ఒప్పందాన్ని జీఎమ్మాఆర్ సంస్థ విరమించుకుంది.దీంతో వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమం అయింది.

రన్ వే విస్తరణ కోసం 253 ఎకరాల భూసేకరణ
వరంగల్ నగరంలో ఇప్పటికే ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. విమానాశ్రయం రన్ వే విస్తరణ కోసం మరో 253 ఎకరాల భూమి అవసరమని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో తెలంగాణ సర్కారు భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 253 ఎకరాల భూమిలో కొంత రన్ వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), నావిగేషనల్ ఇన్ స్ట్రూమెంట్ ఇన్ స్టలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు రానున్నాయి.

మంత్రుల చొరవ
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం కోసం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృషి చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవతో మామూనూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది. ఉడాన్ స్కీం కింద వరంగల్ మామునూరు ఎయిర్‌ఫీల్డ్ ను ఫంక్షనల్ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామమోహన్ నాయుడు, తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించడంతో వరంగల్ విమానాశ్రయం నిర్మాణ ప్రతపాదనలు కార్యరూపం దాలుస్తున్నాయి.


Tags:    

Similar News