తెలంగాణలో రోడ్డు భద్రత ప్రశ్నార్థకం
తెలంగాణలో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం జనగామలో బస్సు బోల్తా పడింది.
By : Shaik Saleem
Update: 2024-09-30 10:04 GMT
తెలంగాణలో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం జనగామలో బస్సు బోల్తా పడింది.జనగామ మండలం యశ్వంతపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో మరో 23 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి.
టైరు పేలడంతో బస్సు బోల్తా
రన్నింగ్ లో టైర్ పేలడంతోనే అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. బెంగళూరు నుంచి వరంగల్ కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.క్షత్రగాతులను జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదం వల్ల వరంగల్ జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
చిన్నారిని బలిగొన్న వ్యాన్
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో సోమవారం స్కూలు ఆవరణలో వ్యాను నాలుగేళ్ల చిన్నారి బలైంది. డ్రైవరు నిర్లక్ష్యంగా వ్యాన్ ను రివర్స్ తీస్తుండగా వెనుక ఉన్న బాలిక పైనుంచి పోయింది. బాలిక మృతితో పాఠశాలలో విషాదఛాయలు అలముకున్నాయి. బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదించారు.
అతివేగమే ప్రమాదాలకు కారణం
డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపటం, రాంగ్ రూటులో వాహనాలు నడపటం, అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని హైదరాబాద్ రవాణ శాఖాధికారి చెప్పారు. అతివేగమే ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు కారణమని రవాణశాఖ అధికారుల పరిశీలనలో తేలింది. సీటు బెల్టు ధరించక పోవడం, ద్విచక్రవాహనాల రైడర్లు హెల్మెట్ ధరించక పోవడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు.
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
ఏటేటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది తెలంగాణలో 20,699 రోడ్డుప్రమాదాలు వాటిల్లాయి. 6,788 మంది మరణించారని పోలీసులు చెప్పారు. రోడ్లపై యాక్సిడెంట్ స్పాట్ల వల్ల కూడా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి., తెలంగాణ వ్యాప్తంగా రోడ్డు భద్రత పాటించక పోవడం వల్ల రోజుకు 20 మంది మరణిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 6,916 మంది డ్రైవింగ్ లైసెన్సులను రవాణశాఖ అధికారులు రద్దు చేశారు.