‘రాజీనామాకు రేవంత్ రెడీ కావాలి’.. కేటీఆర్ ఛాలెంజ్..
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు పట్టిన గతే రేవంత్‌కు పట్టనుందని, వారి తరహాలోనే రేవంత్ రెడ్డి కూడా తన ఉద్యోగం పోగొట్టుకోనున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డిని ఉద్యోగం నుంచి తీయించేయడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెగ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన బామ్మర్దికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన విషయం రేవంత్ మెడకు చుట్టుకుంటుందని వివరించారు. అదే విధంగా రేవంత్ చెప్తున్నది ఫోర్త్ సిటీ కాదని, ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అంటూ చురకలంటించారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉన్న తమకు అవినీతి ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియదా? అని అన్నారు. సీఎం రేవంత్ పాల్పడిన అవినీతి గుట్టు మొత్తాన్ని రట్టు చేస్తామని, రేవంత్ అవినీతి కథను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. ఈ విషయంలోనైనా ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించి.. సీఎంతో సంబంధం లేకుండా ఈ అవినీతిపై పూర్తిస్థాయి విచారణ చేసి నిగ్గు తేల్చాలని సూచించారు. అంతటి చిత్తశుద్ది ఉంటే హైకోర్టు సీజే దగ్గరకు మంత్ర పొంగులేటి తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
రాజకీయ సన్యాసం తీసుకుంటాం..
అమృత్ టెండర్ల విషయంలో రూ.8,888 కోట్ల అవినీతి జరిగింది. అటువంటిదేమీ లేదని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కాంగ్రెస్ సర్కార్‌కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ‘‘ సీజే దగ్గరకు రావడం కూడా ఇష్టం లేకపోతే కనీసం ఢిల్లీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరకైనా రావాలి. ఇప్పటికైనా తన తప్పును ఒప్పుకుని సీఎం.. ఆ టెండర్లను రద్దు చేయాలి. ఫిరాయింపుల విషయంపై సీఎం, మంత్రులు కలిసికట్టుగా న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రేవంత్ అవినీతిపై కేటీఆర్ ఆరోపణలవివే..
‘‘తన ఇంట్లోని లంకె బిందెలు నింపుకోవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి అక్రమ టెండర్లకు తెరలేపారు. బామ్మర్ది కళ్లలో సంతోషం చూడటం కోసం ఎన్నుకున్న ప్రజల వెన్నునే విరిస్తున్నారు. అమృత్ టెండర్ల పేరిట రూ.8,888 కోట్ల కుంభకోణం చేశారు. అందుకనే రూ.8,888 కోట్ల టెండర్లకు సంబంధించిన వివరాలను బయటపెట్టకుండా గోప్యంగా ఉంచుతున్నారు. స్టాక్ ఎక్సేంజీలకు ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ సమాచారం ఇవ్వాల్సిన గత్యంతరం పట్టడంతోనే ఈ టెండర్ల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది దక్కించుకున్న వందల కోట్ల టెండర్ల వ్యవహారం వెలుగు చూసింది. ఈ టెండర్లకు సంబంధించిన ఒక్క జీవోను కూడా ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదు. రేవంత్ రెడ్డి పాల్పడుతున్న అనేక కుంభకోణాలకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను ప్రజల ముందు ఉంచుతాం. కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఫోర్ బ్రదర్స్ సిటీ వంటి ఎన్నో కుంభకోణాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తన బామ్మర్దికి అమృతం పంచుతూ ఎన్నుకున్న ప్రజలకు విషాన్ని పంచుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి’’ అని మండిపడ్డారు కేటీఆర్.
బెదిరించి మరీ టెండర్లు
‘‘సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డికి చెందిన కంపెనీకి ఎటువంటి అర్హతలు లేకపోయినా వేల కోట్ల విలువైన పనులను సీఎం కట్టబెట్టారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే సంస్థను పిలిచి బెదిరించి వారి పేరుతో బామ్మర్ది కంపెనీకి టెండర్లను కట్టబెట్టించారు. పనుల టెండర్లు సొంతం చేసుకుందని పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ కానీ పనులు చేస్తుందని మాత్రం రేవంత్ బామ్మర్ది. టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో జాయింట్ వెంచర్ డ్రామా ఆడి రేవంత్ బామ్మర్ది రూ.1,137 కోట్ల కాంట్రాక్టు సొంతం చేసుకున్నారు. ఇందులో టెండర్ గెలుచుకున్న కంపెనీ 20 శాతం పని చేస్తుంటే.. సీఎం రేవంత్ బామ్మర్ది సంస్థ 80శాతం అంటే రూ.1000 కోట్ల పని చేస్తుంది. ఈ మేరకు ఐహెచ్‌పీ అనే సంస్థ సెబీకి సమాచారం ఇచ్చింది. ఇండియన్ హ్యూమ్‌ను శిఖండి సంస్థగా అడ్డుపెట్టుకుని రేవంత్ రెడ్డి, ఆయన బామ్మర్ది కలిసి తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు. స్వయంగా రంగంలోకి దిగి.. అధికారులను భయపెట్టి మరీ సీఎం రేవంత్ ఈ కాంట్రాక్టులను తన బామ్మర్ది సంస్థకు కట్టబెట్టారు’’ అని కీలక ఆరోపణలు చేశారు కేటీఆర్.