మూసీకి రూ.4వేల కోట్లు ఇవ్వండి -సీఎం రేవంత్

మూసీ నది ప్రాజెక్టుకి, హైదరాబాద్ జంట జలాశయాలను తాగు నీటితో నింపేందుకు తెలంగాణ సర్కార్ కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను కోరింది.

By :  Vanaja
Update: 2024-07-22 15:11 GMT

మూసీ నది ప్రాజెక్టుకి, హైదరాబాద్ జంట జలాశయాలను తాగు నీటితో నింపేందుకు తెలంగాణ సర్కార్ కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను కోరింది. మూసి నది అభివృద్ధికి, గోదావరి నది నీటిని నగరంలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ లకు మళ్లించేందుకు రూ.10,000 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ ను కలిశారు. ఈ సమావేశంలో మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే మురికి నీరంతా మూసీ నదిలోకి వస్తోందని, శుద్ధి చేసిన నీరు మాత్రమే నదిలోకి వెళ్లేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

జాతీయ నదీ పరిరక్షణ పథకం కింద రూ.4 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను గోదావరి నది నీటితో నింపేందుకు రూ.6,000 కోట్లు కేటాయించాలని కోరారు. జంట జలాశయాలను గోదావరి నది నీటితో నింపడం వల్ల హైదరాబాద్‌ లో తాగునీటి ఎద్దడి లేకుండా చూసేందుకు దోహదపడుతుందని రేవంత్ రెడ్డి కేంద్రమంత్రికి తెలిపారు. 2019లో జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు నిధులు కేటాయించలేదని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. రాష్ట్రంలో 7.85 లక్షల ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు లేవని ముఖ్యమంత్రి చెప్పారు. వీటితో పాటుగా పీఎంఏవై కార్యక్రమం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఇంటింటికీ కుళాయి నీటి కనెక్షన్లు అందజేయడానికి రూ.16,100 కోట్లు అవసరమని చెప్పారు.

బిజీబిజీగా రేవంత్...

ఢిల్లీ టూర్ లో ఉన్న రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి భేటీ అయ్యారు. రాహుల్ గాంధీని వరంగల్ సభకి రావాలని ఆహ్వానించారు. రుణమాఫీ అంశాన్ని ఆయనకి మంత్రులతో కలిసి వివరించారు.

హర్ దీప్ సింగ్ పూరీతో భేటీ...

పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ‌లో రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ స‌ర‌ఫ‌రా చేస్తున్న విష‌యాన్ని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. వినియోగ‌దారుల‌కు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల‌కు (ఓఎంసీ) చెల్లించే అవ‌కాశాన్ని క‌ల్పించాల‌ని ఆయనకి విజ్ఞ‌ప్తి చేశారు.

Tags:    

Similar News