పోలీసుల ఆందోళనకు రేవంత్ రెడ్డి చేతకాని తనమే కారణమా..!

తెలంగాణలో ఒకే పోలీస్ విధానం కావాలంటూ ఒకవైపు బెటాలియన్ కానిస్టేబుళ్లతో పాటు మరోవైపు వారి కుటుంబీకులు నిరసన తెలుపుతున్నారు.

Update: 2024-10-26 12:02 GMT

తెలంగాణలో ఒకే పోలీస్ విధానం కావాలంటూ ఒకవైపు బెటాలియన్ కానిస్టేబుళ్లతో పాటు మరోవైపు వారి కుటుంబీకులు నిరసన తెలుపుతున్నారు. పోలీసు శాఖ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నినాదాలు కూడా చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సబిత ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. పోలీసులు రోడ్డెక్కడానికి రేవంత్ రెడ్డి చేతకాని తనమే కారణమంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

హోంశాఖను నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి ఫెయిల్ కావడంతోనే ఈరోజున భద్రత కల్పించాల్సిన పోలీసులే రోడ్డెక్కి ఆందోళన చేపడుతున్నారని అన్నారామే. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే న్యాయం కావాలంటూ రోడ్డెక్కడం చాలా బాధగా ఉందని, పోలీసుల బాధలను కూడా అర్థం చేసుకోవాలని అన్నారు మాజీ మంత్రి. చరిత్రలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి రాలేదని, పోలీసులు రోడ్డెక్కి తమకు న్యాయం చేయాలని కోరడం ఇదే తొలిసారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా పాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారామే.

మంత్రి లేకపోవటమే కారణం

‘‘తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతున్నా హోం మంత్రి లేకపోవడం వల్లే ఇటువంటి దుస్థితి వచ్చింది. సరైన హోంమంత్రి లేకపోవడంతో తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో కానిస్టేబుళ్లకు తెలియని పరిస్థితి నెలకొంది. దాని వల్లే ఈరోజు యూనిఫామ్‌లు వేసుకుని మరీ ధర్నాలు చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేకపోవడం బాధాకరం. ఒకే పోలీసు వ్యవస్థను అమలు చేసి సీఎం రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకోవాలి. 18 రోజులకు 4రోజులు గడిపే పాత పద్దతిని కొనసాగించాలి. ఈ విషయంలో డీజీపీ స్థాయి అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి’’ అని ఆమె కోరారు. కాగా కానిస్టేబుళ్ల నిరసనపై ఇప్పటికే డీజీపీ జితేందర్ స్పందించారు.

డీజీపీ ఏమన్నారంటే..

ఆందోళన చేస్తున్న కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ వెల్లడించారు. సెలవులపై పాతపద్దతిని అమలు చేస్తామని చెప్పినా ఆందోళనలకు దిగడాన్ని పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుందని ఆయన వెల్లడించారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘనను ఎట్టిపరిస్థితుల్లో సహించమని స్పష్టం చేశారు. ‘‘ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ జీతభత్యాలు తెలంగాణలో చెల్లిస్తున్నారు. పోలీసుల సంక్షేమం కోసం భద్రత, ఆరోగ్య భద్రత లాంటివి అమలు చేస్తున్నాం. పోలీసు ఇమేజ్‌ను కాపాడటం మన బాధ్యత. ఇలా రోడ్లెక్కి ఆందోళన చేయడం సరికాదు. సీనియర్ పోలీసు అధికారులుగా మీ సమస్యలు పరిష్కరిస్తాం. దర్బార్‌లో ప్రతి ఒక్కరూ తమ సమస్యలను వివరించుకోవచ్చు. ఇప్పుడు ఆందోళనలు తెలుపుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయి. అందుకు రంగం సిద్ధం చేస్తున్నాం’’ అని ప్రకటించారు.

Tags:    

Similar News