ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ వర్సిటీలపై సీఎం కీలక ఆదేశాలు

తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

By :  Vanaja
Update: 2024-07-19 15:15 GMT

తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శుక్రవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులతో సమావేశమై చర్చలు జరిపారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. అందులో భాగంగా నేడు సెక్రటేరియట్ లో జరిగిన భేటీలో ఆర్కిటెక్ట్స్ రూపొందించిన పలు నమూనాలను సీఎం, డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఒకే చోట ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్ట్ గా కొడంగల్, మధిర నియోజవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొడంగల్, ఖమ్మం నియోజకవర్గాల్లో 20 ఎకరాల చొప్పున భూమిని కూడా ప్రభుత్వం సేకరించింది.

స్కిల్ వర్సిటీ అధికారులతో భేటీ...

సెక్రటేరియేట్ లో స్కిల్ వర్సిటీ అధికారులతోనూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ భేటీలో యూనివర్సిటీల్లో సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సుల గురించి అధికారులు సీఎం, డిప్యూటీ సీఎంలకు వివరించారు. ఈ సందర్భంగా కోర్సుల విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. ఢిల్లీ హర్యానా తరహాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు డ్రాఫ్ట్ రెడీ చేయాలని సూచించారు. శిక్షణ పూర్తైన విద్యార్థులకు వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి కంపెనీలతో ముందుగానే మాట్లాడాలని చెప్పారు. స్కిల్ వర్సిటీ విషయంలో రాజీపడొద్దని, దీనికి సంబంధించి పూర్తిస్థాయి ముసాయిదాను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.

Tags:    

Similar News