ధాన్యం కొనుగోళ్లలో సంస్కరణలు,సన్నాలకు రైతులకు బోనస్ చెల్లింపు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాలశాఖ విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చింది. రైతులకు ప్రయోజనం కల్పించేలా పలు మార్పులు చేశామని డి.ఎస్.చౌహన్ వెల్లడించారు.

Update: 2024-11-18 14:23 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి ధాన్యం కొనుగోళ్లలో కీలక సంస్కరణలు తీసుకొచ్చిందని రాష్ట్ర పౌర సరఫరాల ముఖ్య కార్యదర్శి,కమిషనర్ డి.ఎస్.చౌహన్ చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు రైతాంగానికి ప్రయోజనం కలిగించిందుకేనని ఆయన స్పష్టం చేశారు.


13.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు డి.ఎస్.చౌహన్ చెప్పారు.ఇప్పటి వరకు రైతులకు రూ.1560.70 కోట్లు చెల్లించామని ఆయన పేర్కొన్నారు.

8,066 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
కనీవినీ ఎరుగని రీతిలో ధాన్యం దిగుబడి పెరగడంతో ముందెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 8,066 కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాలశాఖ ప్రారంబించిందని చౌహాన్ తెలిపారు.ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 13.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 10.11 మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకం కాగా 3.02 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు ఉన్నాయని చెప్పారు.ఇప్పటి వరకు సన్నాలకు చెల్లించిన బోనస్ 9.21 కోట్లు అని ఆయన వివరించారు.సాంకేతిక కారణాలతో కొంత జాప్యం జరిగిందని ఇకపై కొనుగోళ్లు, చెల్లింపులు వేగవంతం చేశామన్నారు.

జనవరి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ
వచ్చే ఏడాది జనవరి నుంచి చౌకధరల దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి మార్గదర్శకాలు జారీ చేశామని డి.ఎస్.చౌహన్ వెల్లడించారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 2.81 లక్షల లబ్ధిదారులకు ప్రయోజనం కలగ బోతుందన్నారు.

పాత పాలసీతో ప్రభుత్వ ఆదాయానికి గండి
పాత పాలసీలో ఉన్న లొసుగులతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని చౌహాన్ చెప్పారు.ప్రభుత్వ ఆదాయానికి గండి పడడం అంటే ప్రజా సొమ్ము దుర్వినియోగం అయినట్లేనని ఆయన వివరించారు.2014 నుంచి 2023 వరకు కార్పొరేషన్ పై రూ.58,623 కోట్ల భారం పడిందన్నారు.సంవత్సరానికి ఐదు కోట్లకు పైగా భారం పెరుగుతూ వచ్చిందని ఆయన చెప్పారు.కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కేవలం సంవత్సరం లోపే రూ. 11,608.40 కోట్లు చెల్లించి ఆ భారాన్ని రూ.47,014.68 కోట్లకు కుదించినట్లు ఆయన తెలిపారు

మిల్లర్లు అవకతవకలకు పాల్పడితే చర్యలు
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ధాన్యం ఇచ్చే ప్రసక్తి లేదని చౌహన్ తేల్చిచెప్పారు.ఇప్పటి వరకు 362 మంది మిల్లర్లు అవకతవకలకు పాల్పడ్డారని తేలిందన్నారు.ఎలాంటి అవకతవకలకు పాల్పడని రైస్ మిల్లలుకు 10శాతం బ్యాంక్ గ్యారెంటీ గా నిర్ణయం తీసుకోగా అవకతవకలకు పాల్పడి అసలు చెల్లించి పెనాల్టీ చెల్లించిన వారికి 20శాతంగా ,అసలు చెల్లించి పెనాల్టీ చెల్లించని మిల్లులకు 25శాతంగా బ్యాంక్ గ్యారంటీ నిర్ణయించామన్నారు.

పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు
ధాన్యం కొనుగోళ్లల పర్యవేక్షణకుగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిందని చౌహాన్ చెప్పారు.సన్నాలు,దొడ్డు రకాలు కలవకుండా ఉండేందుకు ప్రత్యేక కమిటీలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నాయన్నారు.ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కమిటీలు తనిఖీలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని డి.ఎస్.చౌహన్ వివరించారు.



Tags:    

Similar News