ఒకే రోజు 548 విమానాల రాకపోకలు..శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రికార్డ్
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది మే నెలలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. విమానాల సంఖ్యతో పాటు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
By : Shaik Saleem
Update: 2024-06-24 12:17 GMT
హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత నెలలో రికార్డు స్థాయిలో విమాన ప్రయాణికులు రాకపోకలు సాగించారు.ఈ ఏడాది మే నెలలో 2.3 మిలియన్ల మంది విమాన ప్రయాణికులు రాకపోకలు సాగించారని జీఎంఆర్ విమానాశ్రయ వర్గాలు విడుదల చేసిన నివేదికలో తెలిపింది.హైదరాబాద్ విమానాశ్రయంలో ఈ ఏడాది మే 4వతేదీన ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడింది.
- ఈ విమానాశ్రయంలో ఈ ఏడాది మే 18వతేదీన అత్యధికంగా 548 విమానాల్లో 82,300 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఏ యేటి కా ఏడు హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశీయ విమానాల ట్రాఫిక్ 10 శాతం పెరిగింది.హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్ 14 శాతం పెరిగింది.
- ఏప్రిల్ 20వ తేదీన 544 విమానాలు రాకపోకలు సాగించాయి. విమానాల సంఖ్యతోపాటు ప్రయాణికుల సంఖ్య పెరిగింది.ఏప్రిల్ 20వతేదీన 79,000 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు.
-హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఈ ఏడాది మే నెలలో కొత్త మైలురాయిని చేరుకుంది.
విహారయాత్రలతో పెరిగిన విమాన ప్రయాణికులు
హైదరాబాద్ నుంచి వేసవికాలంలో ఉద్యోగులు వివిధ ప్రాంతాల పర్యటనలకు వెళుతుంటారు. విహార యాత్రల వల్ల గగనయానంలో విమాన ప్రయాణికుల రద్దీ పెరిగింది.విదేశాల నుంచి హైదరాబాద్ నగరానికి రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నారు. విశాఖ నుంచి కూడా హైదరాబాద్ కు ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.ఏప్రిల్, మే నెలల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దేశీయ సర్వీసులతోపాటు అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకల సమయపాలనలో హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉంది.
అవార్డులెన్నో...
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు అవార్డులు లభించాయి. న్యూఢిల్లీలో జరిగిన ఏసీఆర్ఈఎక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ స్థాయి అవార్డుల పోటీలో హైదరాబాద్ విమానాశ్రయం అత్యున్నత అవార్డు గెలుచుకుంది.ఎనర్జీ ఎఫిషియెన్సీ, కమర్షియల్ బిల్డింగ్ కేటగిరీలో హైదరాబాద్ విమానాశ్రయం విజేతగా నిలిచింది.
ఏటేటా పెరుగుతున్న విమాన ప్రయాణికులు
ఈ ఏడాది హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జనవరి నెలలో 21.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. గత ఏడాది కంటే 14 శాతం విమాన ప్రయాణికులు పెరిగారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 జనవరి నెలాఖరు వరకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 2.07 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఈ సంఖ్య 2022 వ సంవత్సరం కంటే 21 శాతం ప్రయాణికులు అధికమని తేలింది. హైదరాబాద్ నుంచి ప్రతీ ఏటా రాకపోకలు సాగించే విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
సమయపాలనలో శంషాబాద్ విమానాశ్రయం నంబర్ వన్
విమానాల రాకపోకల్లో సమయపాలన పాటించడంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో విమానాల రాకపోకల సమయాలు పాటించడంలో 90.43 శాతం ఆన్ టైమ్ నమోదు చేసినట్లు ఏవియేషన్ అనలిటికల్ సంస్థ సర్వేలో వెల్లడైంది. గ్లోబల్ ఎయిర్ పోర్టు, లార్జ్ ఎయిర్ పోర్టు విభాగాల్లోనూ శంషాబాద్ విమానాశ్రయం అగ్రస్థానంలో నిలిచింది.